చైతన్యం మొదలయ్యేది విశ్వవిద్యాలయలతోనే..!


<<<చైతన్యం మొదలయ్యేది విశ్వవిద్యాలయలతోనే...!>>>


     బీజేపీ ప్రభుత్వం అధికారపీటమేక్కిన నాటి నుండి దేశంలో మతతత్వ చర్చలు, కులాహంకార దాడులు, స్త్రీలపై పిచ్చి ప్రేలాపణలు షరామాములే అయిపోయాయి. ఇలాంటి పరిస్థితులు భారత ప్రజాస్వామ్యవాదులలో చెప్పలేని ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హిందువేతరులకు అనేది కాదనలేని వాస్తవం. ఎందుకంటే ఫాసిస్టు ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో ముఖ్యమైన సిద్ధాంతం ‘వ్యతిరేకతను అణచివేయడం’. భారతదేశం రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నపటికీ ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి మోడీ ప్రభుత్వ విధానాలు హిట్లర్ ఫాసిస్టు ప్రభుత్వాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతీవారిని ‘దేశద్రోహులుగా’ చిత్రీకరించడం ఫాసిస్టు విధానమే. 
భారత పౌరసత్వ సవరణ చట్టం నిరసనలో మోదినీ హిట్లర్ తో పోలుతూ ప్లకార్డ్ 
    
  ఈ పరిస్థితిని చూస్తుంటే జార్జ్ ఆర్వెల్ గారు రాసిన ‘అనిమల్ ఫార్మ్’ అను నవలలోని స్నోబాల్ అను పాత్ర గుర్తుకు వస్తుంది. ప్రభుత్వ పెద్దయిన నెపోలియన్ ను వ్యతిరేకించి ఆదర్శ భావాలు మాట్లాడి ప్రజలను చైతన్య పరచడం నచ్చక నపోలియన్ స్నోబాల్ పై లేనిపోనివి ఆపాదించి ఆ ప్రజలతోనే దాన్ని తరిమేట్టు చేస్తాడు. ఇదే పద్దతిని మోడీ ప్రభుత్వం ఆచరిస్తుందా అంటే అవుననే చెప్పాలి. ఇప్పుడు ఇంకా శ్రుతిమించి వ్యతిరేకులను ‘పాకిస్తానుకు వెళ్ళు’ అనేదాకా వచ్చారంటే తీవ్రవాదం ఏ విధంగా శృతి మించి రాగాన పడుతుందో అర్ధమవుతుంది.
అనిమల్ ఫార్మ్ నవలలో ప్రజలను చైతన్యపరుస్తున్న స్నోబాల్ 
               ఇలా దేశద్రోహ ముద్రపడిన వారిలో మొదటి వరుసలో ప్రభుత్వ అప్రజాస్వామిక, అలౌకిక విధానాలను వ్యతిరేకిస్తున్న విశ్వవిద్యాలయ విద్యార్ధులు మొదటి వరుసలో ఉంటారు. ఈ మధ్య నా మిత్రులతో ఈ విషయం పై చర్చిస్తుండగా ‘విద్యార్ధులకు రాజకీయాలు అవసరమా?’ అని పెదవి విరిచాడు. ప్రజలు పాలనాపరమైన, సంఘీకపరమైన, న్యాయపరమైన దేశ సిద్ధాoతల్లో హేతుబద్దత లోపించినప్పుడు ప్రశ్నించిన వారికి రాజకీయ రంగు పులమడంలో ఈ వ్యవస్థ విజయం సాధించిందనే చెప్పొచ్చు.

               ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత అనునది అత్యంత ప్రామాణికమైన విషయం. ముఖ్యంగా భావి భారత నాయకులైన విద్యార్ధులు, విశ్వవిద్యాలయాలు మార్పుకు కరదీపికలు కావాలి అని మనమందరూ తెలుసుకోవాలి.  సర్వేపల్లి రాధాకృష్ణ గారు ‘ఫౌండేషన్స్ అఫ్ ది సివిలైజేషన్’ అను పుస్తకంలో విశ్వవిద్యాలయాల  గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటారు.

“విశ్వవిద్యాలయాలు మనసు యొక్క స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్చను పెంపొందించేటట్లు ఉండాలి....నేటి మార్పు పొందుతున్న పరిస్థితులలో విశ్వవిద్యాలయాలు, ఆలోచనలు, ఆదర్శాలను నాయకత్వము వహించాలి. భారతదేసము మరియు ప్రపంచ రాష్ట్రాలు మతకల్లోలాల్లో ప్రాంతీయ విద్వేషాలలో పరధ్యాస పట్టువేళ. విశ్వవిద్యాలయాలు ఆత్మవిమర్శ, సహేతుకతను ప్రజల్లోకి తిసుకువెళ్లాలి” అని అంటారు...ఏ శక్తులైతే స్వేచ్ఛను అణచివేయడానికి అధికారాన్ని వాడుతుంది మతతత్వ మూర్ఖత్వము, జాత్యపరమైన విద్వేషాలను రెచ్చగొడుతుంది విశ్వవిద్యాలయాలు ముందున్న అతి పెద్ద సవాలు వీటిని అణచివేయడము అని అంటారు.”

               రాధాకృష్ణ గారు చెప్పిన ఈ విలువలన్నీ పాటించడానికి విద్యార్థులు ఊపిరాడని, గాలిదూరని, తరగతిగదిలో వేల పుస్తకాలు చదివి ఉద్ధరించలేరు. ఆ పుస్తకాలలో దాగి ఉన్న సిద్ధాంతాలను వాస్తవికతను జోడించి అణచివేత పై పోరాటం కొనసాగించాలి.

           విశ్వవిద్యాలయాలు పోరాటపటిమ భారతదేశానికి కొత్త  కాదు ప్రపంచానికీ కొత్త కాదు. ప్రపంచంలో ఏ అభ్యుదయ వాదానికైనా విశ్వవిద్యాలయాలే ముందు వరుసలో నిల్చుంటాయి. దేశ సమస్యనైనా, రాష్ట్ర సమస్యనైనా ప్రజల్లో కూలంకషగా  అణచివేత పై అవగాహన కల్పించి ప్రజల్లో ప్రశ్నించే స్ఫూర్తి నింపేది ఏ పోరాటంలోనైన విద్యార్థులే. ఆ విద్యార్థులకు ఊతం ఇచ్చేవి కూడా ఈ విశ్వవిద్యాలయాలే.

           ఎమర్జెన్సీ కాలంలో దేశమంతా ఏం జరుగుతుందో తెలియని వేళ. ఆకాశవాణి వార్తల శీర్షికలు కూడా ప్రధాని రాస్తున్న వేళ. జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థులు బులిటెన్లు విడుదల చేసి ఎమర్జెన్సీ పై ప్రజలలో వ్యతిరేకతను తీసుకొచ్చారని చెప్పొచ్చు. అమెరికాలో వియత్నాం యుద్దానికి వ్యేతిరేకంగా చేసి నిరసనలు ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యపరిచిందీ విద్యార్థులే. మే 1970 లో ఓహియో కంటే విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు గాయపడడంతో ప్రజల్లో ఆందోళన మొదలై ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమైంది.
వియత్నాం యుద్ధ సమయంలో నిరసనలో అమెరికా విద్యార్ధులు 


తెలంగాణా ఉద్యమం సమయంలో అట్టుడికిపోయితున్న ఉస్మానియా విద్యాలయ ప్రాంగణం
వివాదాస్పద పౌరసత్వ బిల్లు సవరణపై నిరసిస్తున్న జామియా విశ్వవిద్యాలయ విద్యార్ధులు 

           మన ఆంధ్ర స్వాతంత్ర్య సమరంలో చూసుకుంటే రాజముండ్రి ఆర్ట్స్ కళాశాల ‘వందేమాతరం’ ఉద్యమానికి నాంది పలికింది. కళాశాల ప్రధానోపాధ్యాయులు మార్క్ హంటర్ ‘వందేమాతరం’ అను నినాదాలను, చిహ్నాన్ని నిషేదించారు. అనైతికమైన ఆ నియమమును నిరసిస్తూ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో నిరసించారు. నియమమును ఉల్లంఘించిన వారిని కళాశాల నుండి బహిష్కరించిన మాట అటుంచితే గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారి లాంటి విద్యార్ధులు ఈ అనైతిక నియమాన్ని ప్రశ్నించి ప్రజలలో భారత స్వాతంత్ర్య సమరం పై అవగాహన ఇంకా కలగని తెలుగు ప్రజలకు పోరాట స్ఫూర్తినిచ్చారనే చెప్పుకోవచ్చు.

                       ప్రాంతీయంగా చూస్తే 1935లో ఉస్మానియా విద్యార్ధులు ముల్కీ నిబంధనల ఉల్లంఘన పై పోరుబాట మొదలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎలా ఊపిరయ్యిందో మనము చూసాము. జార్జ్ రెడ్డి లాంటి వారిచ్చిన విప్లవ స్ఫూర్తిలో చదువుకుంటున్న ఉస్మానియా విద్యార్ధులు ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి  ఎలా పాటుపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్పష్టంగా చెప్పాలంటే ఉస్మానియా విద్యార్ధులు లేకుండా తెలంగాణ ఉద్యమమే ఊహించలేము. 1972లో గౌతు లచ్చన్న నాయకత్వంలో ఆంధ్రా విశ్వ విద్యాలయంలో పుట్టిన జై ఆంధ్ర ఉద్యమం...ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటల్లో ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలు, విశ్లేషణలు, విప్లవాలు  విశ్వవిద్యాలయాలు కేంద్రంగానే ప్రారంభమవుతాయని  తెలుసుకోవచ్చు.

               అక్షరం వికసించే ఈ వనంలో, జ్ఞానం ఫరిడవిల్లే ఈ స్థాలంలో అన్యాయాన్ని, అణచివేతను ప్రశ్నిoచడం విద్యార్ధుల కర్తవ్యం మరియు దేశ ప్రగతికి అత్యావశ్యకములు. ప్రభుత్వ అణచివేతను ప్రశ్నిoచేవారికి రాజకీయ రంగు పులమడం వారి చేతగానితనాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా నేటి పరిస్థితులలో ప్రతిపక్షం మరీ బలహీనంగా ఉన్న వేళ విశ్వవిద్యాలయాలు ప్రతిపక్ష పాత్ర పోషించడం వల్ల తమ డొల్లతనం బయటపడుతుందనే ఆందోళన అధికార పార్టీ అణచివేత ధోరణి చూస్తే తేటతెల్లమవుతుంది. ఏదేమైనా ప్రభుత్వ అణచివేతను, వివక్షతను, రాజ్యాంగవిరుద్ధమైన విధానాలను వ్యతిరేకించి ప్రజలను చైతన్యపరచు విద్యార్ధులకు రాజకీయ రంగు పులమడం అసమంజసం.

ఉరికి ఉరికి కొట్టినా
బెరుకు లేని సమాధానం

తలలు పగులగొట్టినా
తగ్గలేదు తెగువ 

అన్యాయంగా నిర్బంధించినా
అలగని ఆ నిబ్బరం 

మీరెన్ని చిత్రవధ చేసినా
మిటకరించదు మాతృభూమిపై
మా మమకారం
-     పిటి పార్కర్

Post a Comment

0 Comments