పుట్టినరోజు ధన్యవాదాలు

*పుట్టినరోజు ధన్యవాదాలు*

పుట్టినరోజు అనగానే నాకు రకరకాల విషయాలు గుర్తుకొస్తుంటాయి. కానీ ఎవరో గుర్తులేదు గాని ఒకాయన 13 సంఖ్య మంచిది కాదు అన్నాడు. అంతే ఆ చిన్నవయసులో దానికి చాలా పెద్ద ఆలోచనే చేసాను. కానీ ఎందుకో ఎవరూ చెప్పలేదు. కానీ తరువాత తెలిసింది క్రీస్తు 13 శిష్యుడు యూదా ఇస్కరియోతు కావున అని. మళ్ళా నేను పుట్టింది మంగళవారం అట. అది కూడా మంచి రోజు కాదని అమ్మమ్మ చెపుతుంటే విన్నాను. మళ్ళీ ఆలోచనలో పడ్డాను. టీచర్లు చెప్పేది ప్రతీ విషయాన్ని ఒక విద్యార్థి అన్వయించుకుంటాడు. ముఖ్యంగా ఒక విద్యార్థి పేరు ఒక మాథ్స్ ప్రాబ్లెమ్లో ఉన్నా, కథలో ఉన్నా, పాఠంలో ఉన్నా అదో పెద్ద గొప్పతనం. కానీ నా పేరు ఏ పుస్తకం ఉండేది కాదు.  పదో తరగతిలో హిందీ ఉపవాచకం మొదటి పాఠం జల్లియన్వాలా బాగ్ ఉదంతం గురించి ఉండేది. అది జరిగింది 13 ఏప్రిల్ రోజునే. ఇక నా పుట్టిన తేదీ ఉందని సంబరిపడిపోయాను. కానీ పాఠం చెప్పిన తరువాత చిన్నబుచ్చుకున్నాను. ఇదేంట్రా బాబు ఈ 13 తేదీ అనుకున్నాను.

కొన్ని రోజుల తరువాత ఇంగ్లీష్ రెండో పాఠం మొదలుపెట్టారు. ఆ పాఠం పేరు CELEBRATION OF BEING ALIVE. ఆ పాఠం రాసింది క్రిస్టియన్ బెర్నార్డ్ గారు. ఆ పాఠంలో జీవితం విలువను ధనికుడైన ఒక డాక్టర్ గుడ్డివారైన పిల్లల్ని, వారి నిష్కల్మష ఆనందాన్ని చూసి తెలుసుకుంటాడు. జీవితంలో ప్రతీ రోజు పుట్టిన రోజు లాంటిదే అంటుంటారు ఆ రచయిత. అప్పుడు అనిపించింది. ఇదిరా నిజమైన పాఠం అంటే! ఇప్పటికీ కూడా. అప్పటి మా ఇంగ్లీషు మాస్టర్ కారంపూడి వెంకటేశ్వర రావు గారు కూడా ఆ పాఠాన్ని అంత బాగా చెప్పారు. నా ఆప్త మిత్రులకు, నా స్టూడెంట్స్ కు, నా కొలీగ్స్ కు ఈ విషయం బాగా తెలుసు. వారికి రోజూ 'హ్యాపీ బర్త్డే' చెప్తుంటాను. కానీ వారు నాకు ఈ ఒక్క రోజే చెప్తారు. ఇలా పుట్టిన రోజు తేదీ పైన అభ్యంతరం నాకు తొలగిపోయింది.

అలాగని పుట్టిన రోజు వచ్చింది అంటే జీవితంలో ఒక రోజు అయిపోయింది అని నిరాశ వచనాలు మనము ఇవ్వము. ఇలా పుట్టిన రోజు గురించి చెప్పేప్పుడు ప్రముఖ చిత్రకారుడు పాబ్లో పియాస్కో గారి జీవితంలో ఒక సంఘటన గుర్తుకొస్తుంది. "It takes long time to grow young" ("ఒకరు బాల్యానికి ఎదగాలంటే చాలా సమయం పడుతుంది") అని అంటారు. మొదట ఇది చదివినప్పుడు అదెలా కుదిరిద్ది అనుకున్నాను. కానీ ఆ సందర్భం చదివిన తరువాత అర్ధమయ్యింది. ఆ వాక్యంలో  ఎంత గొప్ప అర్థం ఉందొ.

ఓసారి పాబ్లో పియాస్కో గారు ఓ చిత్ర ప్రదర్శనలో పాల్గొన్నప్పుడు ఓ గొప్ప విమర్శకులు పియాస్కో గారి చిత్రాలు చూసి మీ పాత చిత్రాలే బాగున్నాయి అన్నారట. అప్పుడు పియాస్కో గారు "ఒకరు బాల్యానికి ఎదగాలంటే చాలా సమయం పడుతుంది" అన్నారట. అదేంటి ఎవరైనా మధ్యవయస్కులు బాల్యానికి ఎదగడం కుదరదు కదా అనుకోవచ్చు. కానీ పియాస్కో గారి వ్యాఖ్యకు చాలా అర్ధాలు తీయవచ్చు. ఒక కుర్రాడికి లేదా మధ్య వయస్కుడికి ఒక రాయిని రాయిగానే చూస్తాడు. కానీ ఏమీ ఎరుగని ఒక చిన్న పిల్లాడికి అది రాయి కాదు. అది మరేదో. వాడికి దానిపై ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఉంటుంది. అంటే ఆ సృజనాత్మకత ఎనలేనిది. అది సంపాదిచ్చుకోవడానికి చాలా మేధో శ్రమ అవసరమని అర్ధం. దీనినే సాహిత్య విమర్శకులు సర్ రియలిసం అని పేరు పెట్టారు. (ఆ సర్ రియలిసంకు సంబంధించి కొన్ని చిత్రాలను పోస్ట్ చేస్తున్నాను. విశ్లేషించడానికి ప్రయత్నించండి)

మరి ఆ బాల్యానికి ఈ మెదడు ఎప్పుడు చేరుతోందో ఎదురు చూడాలి. టాగోర్ గారు కూడా ఆయన గీతాంజలిలో ఈ విషయం పైన అధ్బుతమైన కవిత్వాలు ఈ లోకానికి అందించారు.

నేను పుట్టిన రోజు గురించి ఆ రోజు కొంచెం సంకోచించినా ఇప్పుడు తెగ ఆనందమేస్తుంది. ఎందుకంటే నేను అత్యంత ప్రేమించే తాత్వికుల నడుమీట్లో నేను పుట్టాను. 11 తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు జన్మించారు. 14వ తేదీ అంబేద్కర్ గారు జన్మించి భారత బడుగు, బలహీన వర్గాలకు కరదీపికగా నిలిచారు. వీరు నడుమ పుట్టిన నేను ఆ ఇద్దరి ఆశయాల్లో ఆవగింజంత అయినా అవగతం చేసుకుని ఆచరణ చేయాలనేదే నా కోరిక.

నా 20వ యేడు ఎన్నో మధుర స్మృతులు అందజేసింది. కవనాన్ని ఒక వ్యసనం చేసిన ఒక గొప్ప సంవత్సరంగా నా జీవితంలో ఉండిపోబోతుంది. ఈ 21వ ఏడాది అయినా నేను నా రచనను పూర్తి చేయిస్తుందేమో చూడాలి.

ఈ పుట్టిన రోజున నాకు గుర్తుంచుకొని ఫోన్లు చేసి,మిత్రుల ద్వారా తెలుసుకొని, ఫేస్బుక్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని వాట్సాప్, ఫేస్బుక్, మెస్సెంజర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలిపిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కొలీగ్స్ కు ముఖ్యంగా నా విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

Thank you for making my day memorable.

-పిటి పార్కర్




Post a Comment

0 Comments