నేనెవరిని?
శరణ్ కుమార్ లింబాలే "అక్కర్మషీ" (లంజా కొడుకు/ Son of a bitch) పుస్తకం గురించి
ప్రతీ మనిషి జీవితం అమ్మ కడుపు నుండి బయటకు రాగానే మొదలయితే దళితుడి అసలైన జీవితం మాత్రం బడిలో మొదలవుతుంది. ఎప్పుడు పుట్టాడో కూడా తెలియని వాడికి బడిలో ఓ తేదీ ఇస్తారు. అక్షరాలు ఆయుధాలుగా ఎలా చేయాలో నేర్పిస్తారు. అందుకేనేమో శరణ్ కుమార్ లింబాలే పుస్తకం అక్కర్మషీ (లంజా కొడుకు) అతడు వివక్షతో ఆకులు లేని చెట్టుకింద చదువుకుంటున్న సన్నివేశంతో మొదలవుతుంది.
చాతుర్వర్ణాలు కిందకి నెత్తివేయబడ్డ పంచములు ఈ సమాజంలో అత్యంత దారుణ వివక్షకు గురవుతారు అనగా ఈ సమాజంలో దళితులు దారుణమైన కుల రక్కసి కోరలకు బలవుతారు అనే గట్టి నమ్మకం ఉండేది. కానీ ఈ పుస్తకం చదివాక ఆ భావన మారింది. ఆధిపత్య కులమైన పటేల్ కుల మగ కామత్వానికి బలై 'మాసామయి' (దళిత స్త్రీ) ఈ ప్రపంచానికి తెచ్చిన జీవి ఒక లంజా కొడుకుని... అతనిని అటు ఆ పటేల్ కులస్తులు చీదరించుకుంటారు ఇటు దళిత వాడలో కూడా స్థానం ఉండదు. ఈ సంఘర్షణే ఈ పుస్తకం మొత్తం. సంఘర్షణలో పడిపోయి నైరాశ్యంలో బతకలేదు లింబాలే. సంఘర్షణను విశ్లేషించుకొని రాబోవు సంక్షోభాన్ని ఆపేశాడు. కలం పట్టాడు. కులం అంతు చూద్దామని బయలుదేరాడు.
తన కధ చెబుదామని ప్రారంభించిన లింబాలే, తన కధ కన్నా తన పక్కనున్న ఆడవారి కథలనే చెప్పేశాడు. విచిత్రమేమిటంటే తన కథలో మగ వారు తక్కువ. దాదా మినహా వివక్షకు గురైన మగ పాత్రలు పెద్దగా కనబడవు. సామాన్యంగా దళిత జీవిత గాధలు సదరు రచయిత జీవితంతో మొదలయ్యి తరువాత అది ఆ సమాజం కథలుగా రూపుదిద్దుకుంటాయి. కానీ లింబాలే కధ మాత్రం సమాజం కధ మాత్రమే కాకుండా దళిత స్త్రీ జీవిత గాధను ఆవిష్కరించింది. కానీ అది సానుభూతిగా చూపడం జరిగిందని అనిపించింది. అదే గాధను లింబాలే తల్లి మాసమాయి రాసుంటే వేరేగా ఉంటుందని అనిపించింది.
ఈ పుస్తకం 'దళిత' గురించి అని చాలా మంది చెప్తుంటారు కానీ నాకెందుకో ఈ పుస్తకం 'ఆకలి' గురించి అని అనిపిస్తుంది. ఆకలి కులం వల్ల కలిగి ఉండవచ్చు గాక! కానీ, ఆకలి ప్రధాన కుట్రదారుడిలా లింబాలే చిత్రించడం మనం చూస్తాం. ఆకలి గురించి లింబాలే చెప్పే తత్వం పాఠకులను ఆలోచింపజేస్తుంది.
"భకారి మనిషి అంత పెద్దది. అది ఆకాశంలా విశాలమైనది, సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆకలి మనిషి కంటే పెద్ద ప్రాణి. నరకం యొక్క ఏడు వృత్తాల కంటే ఆకలి చాలా విస్తృతమైనది. మనిషి కంటే ఆకలి చాలా శక్తివంతమైనది. ఒక ఆకలి కడుపు ఓ భూమి లాంటిది. ఆకలి మీ తెరిచిన అరచేతి కంటే పెద్దది కాదు, కానీ అది మొత్తం ప్రపంచాన్ని మింగేస్తుంది. ఆకలి లేకుంటే యుద్ధాలు ఉండేవి కావు. ఆకలి లేకుంటే ఈ భగవంతుని సృష్టి పాపం పుణ్యం స్వర్గం నరకం ఏమై ఉండేవి? ఆకలి లేకపోతే ఒక దేశం, దాని సరిహద్దులు, పౌరులు, పార్లమెంటు, రాజ్యాంగం ఎలా ఏర్పడతాయి? ప్రపంచం కడుపు నుండి పుట్టింది, అలాగే ఆ కడుపుకు తల్లి మరియు తండ్రి, సోదరి మరియు సోదరుల మధ్య సంబంధాలు కూడా ఉన్నాయి."
ఇన్ని ఉన్నా పుస్తకంలో misogyny గురించి చెప్పక తప్పదు. రేప్ చేయడమే మగతం అని చెప్పే వాక్యాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం రాసినప్పుడు స్త్రీ వాదం పెద్దగా తెలియకపోవచ్చు లేక ఒక లంజా కొడుకుగా పిలువబడి, అటువంటి వాడలో పెరిగిన రచయితకు ఆ ఆవేశం రావడం సహజం. ఇప్పటి అభ్యుదయ స్త్రీవాదం ఉన్న పరిస్థితుల్లో అటువంటి వాక్యాలు విమర్శకు గురవక తప్పదు. కానీ రచయిత ఎటువంటి ముసుగు లేకుండా రాశారు అనే దానికి ఈ వాక్యాలే నిదర్శనం కూడానూ....
పుస్తకం చివరికి కూడా రచయిత నేనెవరిని, నేనెక్కడ చెందుతాను అనే సంఘర్షణలోనే ఉండటం చూస్తాము. ఆ సంఘర్షణ సంక్షోభం ఎదుర్కోడానికి అవసరం. ఆ సంఘర్షణే ఆవేశం కలుగజేయాలి. పాఠకులను కూడా అదే ప్రశ్నలో పడేసి ముగించారు కథను...
కానీ, ఈ పుస్తకానికి "లంజా
కొడుకు" అని శీర్షిక పెట్టడం రచయిత assertion
నా లేక dissent నా అనేది నాకు అర్ధం కాలేదు.
- పిటి పార్కర్
3 నవంబర్, 2021
0 Comments