భేదం

 భేదం

నాదంతా కాన్వెంటు చదువే. పెద్దగా ప్రభుత్వ బడుల్లో ఎట్ల పాఠాలు చెప్తారో పెద్దగా జ్ఞానం లేదు గాని వారు పెట్టె "పప్పల పిండి" పై మంచి అవగాహన ఉంది. పిల్లకాయలకు రోజూ ఇంటికి వచ్చేప్పుడు గుప్పెడు, గుప్పుడేంటి ఇంకా ఎక్కువే పిండి ఇచ్చి పంపేవారు. మేము బాయిలర్ కోడుల్లా కిలోల బరువున్న బ్యాగులను మోయలేక నీల్గుతూ వస్తుంటే, గవర్నమెంటు బడిలో నా తోటోళ్లు వాళ్ళ బ్యాగులను ఎదో గోడ పై మేకుకు గుచ్చినట్టు ఆ నున్నటి తలపై తగిలించేస్తారు. అలా తగిలించుకుని ఎంచక్కా చేతులో ఉన్న పిండిని తినుకుంటూ, ఆ పిండి గొంతులో దురద తెచ్చినప్పడు దగ్గేసి ఏంటో తాము మేజిక్ చేశామన్నట్టు తెగ పోజులు కొట్టేవాళ్ళు. నాకు తెగ ఈర్ష్య కలిగేది. నేనూ ఓ రోజు ట్రై చేశా ఆ బ్యాగును తలకు తగిలించడానికి...దెబ్బకి ఆ బరువును తలకాయ ఇరిగే పని అయ్యింది. అదృష్టం బావుండిఅది జారి భుజాలపై పడింది. కానీ వారి బ్యాగు బరువు, నా బరువు ఒకటని తెలియక అదేదో బ్రహ్మ విద్య నాకు రాదు అని తెగ ఫీలైపోయేవాణ్ణి. 

అంగన్వాడీ ఆయమ్మ ప్రతీ శనివారం అనుకుంటా...మిగిలిపోయిన పప్పల పిండిని గోతాల్లోంచి తీసి అందరికీ సమానంగా పంచేది. ఒక్కొక్కడు ఆ రోజు చేతులతో కాక పలకలపై ఆ పిండిని కొండల పేర్చి పోజులు కొడుతూ పోయేవారు. ఓ రోజు నాకూ స్కూలుకు సెలవవ్వడంతో ఆ స్కూలు దగ్గరకు పోయా. వెళ్ళేవారికి ఆయమ్మ పెద్ద పేద్ద సంచుల్లోంచి పప్పల పిండిని తీసి పలకలపై పోసేస్తుంది. వారడిగినంత... అందరూ లైన్లో నించున్నారు. నేను దూరం నుంచి చూస్తుంటే తెగ పోజులు కొట్టారు. మధ్య మధ్య మా ఇంటి దగ్గర ఆంటీలు కూడా వచ్చి సంచుల్లో కొంత పిండిని పట్టుకుపోయారు. ఇంతలో ఒక ఆంటీ ఇక్కడెందుకు నించున్నావ్ అన్నట్టు చూసి వెళ్ళిపోయింది. దొంగ మొహంది. నాకు కొంచెం పెట్టొచ్చుగా అనుకున్నా. ఇంటికి వస్తదిగా అప్పుడు పని పడదామనుకున్న...

ఏదైతే అది అయ్యిందని పోయి నేనూ లైన్లో నించున్నాను. నన్నెదో పురుగులా చూసారు వాళ్ళు. చివరకు నావంతు వచ్చింది. ఆమె నావంక ఎగా దిగా చూసి "నువ్వెందుకు వచ్చావ్" అన్నట్టు చూసింది. అందరూ పలకలలో పిండి పెట్టించుకుంటున్నారు. నేనేందులో పెట్టించుకోవాలో తెలియక కాసేపు తడుముకుని వెంటనే చేతులు చాచేసాను. గుండె 1000 మైళ్ళ వేగంతో కొట్టుకుంటుంది. ఆమె ఓ గుప్పెడు పిండి తీసి నా బుజ్జి చేతుల్లో పోసి... "చాలులే. అమ్మకు తెలిస్తే తిడుతుంది. గమ్మున వెళ్లిపో" అని అంది. ఆమె అంటున్నది నాకు పెద్ద పట్టింపు లేదు. నా చేతుల్లో ఇప్పుడు ధనరాశుల కుప్ప ఉంది. కానిఎలా తినాలి అనేది నా ముందున్న సవాలు. రెండు చేతులు ఆనించి ఉందంగా పోసేసింది. చటుక్కున ఒక చేయి పక్కకు లాగేసరికి కొంత పిండి కింద పడిపోయింది. పక్కన ఉన్నోళ్ళంతా ఫక్కున నవ్వేశారు. ఎదో అపరాధ భావంతో ఒక చేతిలోని పిండిని నాలికతో అంటించి తినేసా... అబ్బా! అమృతం. ఎక్కడన్నా అంత రుచి ఉంటుందా. గబ గబా ఓ చేతిలో ఉన్నదంతా తినేసాను. ఇంకో చేతిలో పిండి ఉంది. సర్లే కాసేపుఆగిన తర్వాత తిందాం అని నా చిన్ని నిక్కర్ జేబులో పోసేసాను. 

ఇంతలో నన్ను చూసిన ఆ ఆంటీ ఇంటికి మోసేసింది. ఆమే వచ్చింది. "అమ్మ పిలుస్తుంది. రా!" అని చేయి పట్టుకు తీసుకెళ్లింది. ఇంటికెళ్లేసరికి మమ్మీ ఎదురుచూస్తుంది. నన్ను చూసిన వెంటనే..."ఎం తింటున్నావ్" అని అడిగింది. ఎం తినలేదన్నట్టు తలాడించా. ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తుంది నా బుడ్డి బుర్ర. కానీ తట్టట్లేదు. ఆంటీ నన్ను పిండి తింటున్నట్టు చూడలేదు అని నాకు తెలుసు. తీరా చూస్తే ఆ పిండంతా ముక్కు, ముఖంపై అద్దుకుంది. మమ్మీ వచ్చి మొహం తుడిచి... డబ్బులు ఎక్కడివి అని జేబులో చేతులు పెట్టేసారికి నా పని మాటాష్.పిండి దొరికేసింది. "ప్చ్" అని చిరాకుపడి ఉన్న పిండినంతా నేలపై దులిపేసింది. అమృతం నేలపై ఒలికిపోయినట్టు చాలా బాధేసింది. 

"ఇంట్లో ఉన్నవి సరిపోవా. ఊర్లో వాటికి ఎగబడుతున్నావ్. అది తినకూడదు. జ్వరం వస్తుంది" అని చేతులు కడిగించి నా వీపు విమానం మోత మోగించింది. తర్వాత నా చేతిలో ఓ స్వీటు చేతిలో పెట్టి వెళ్లిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ స్వీటు పెద్దగా టేస్టీగా లేదు. ఆ పిండి కంటేనా అని అనుకున్నా. 

అసలు నేను ఆ పిండి ఎందుకు తినకూడదు అని నాలో నాకు ఎన్నో ప్రశ్నలు. వాళ్ళు గొప్పోళ్ళు కాబోలు అని తెగ బాధబడిపోయా.... తర్వాత తర్వాత వయసొచ్చే కొద్దీ అది మంచిది కాదని నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. 

భేదాలు. వర్గ బేధాలు, లింగ బేధాలు.... అబ్బో చెప్పుకుంటూ పోతే బోలెడు. మనకు తెలియకుండానే బోలెడు బేధాలు సృష్టించేస్తాం. మనం ఇతరుల కంటే గొప్పవారమని చెప్పుకోవడానికి కొన్ని పోకడలకు పోతుంటాము. దాన్ని పిల్లలపై రుద్ది ఇలా గీతలు గీసేసి తర్వాత చేరిపేయడానికి పోరాటాలు, థియరీలు, సానుభూతులు....

కానీ ఏమాటికామాట...
ఆ పిండి మాత్రం భలే టేస్టీ. ఇంట్లో నేను ఇప్పుడు చేద్దామని చూసినా ఆ రుచి రాదు. ఎందుకంటారు?

- పిటి పార్కర్
16 అక్టోబర్, 2021

Post a Comment

0 Comments