దండోరా
రాజ్యం తరువాయి దళిత బిడ్డను
హత్య చేయడానికి పూనుకున్నప్పుడు
సహనము ప్రదర్శించవద్దు
శాంతి సూత్రాలు వల్లించవద్దు
చేతిలో అర్ధరూపాయి క్యాండిల్ పట్టుకొని
"కర్మ
భూమిలో పూసిన ఓ పువ్వా" అని పాట పాడొద్దు
నెత్తిన ముసుగేసుకొని
"పరదేసులమో
ప్రియులారా" అని
భక్తి నటించొద్దు
నీ గుండెల్లో దించిన కత్తిపోటును గుర్తుచెయ్యి
నీ గొంతున బిగించిన ఉరితాడును గుర్తు చెయ్యి
నీ నోటిలో కుక్కిన గుడ్డలను గుర్తు చెయ్యి
నీ ఒంటిపైన లాఠీ దెబ్బలను గుర్తు చెయ్యి
ఇకపై ఇలా జరగదని చెప్పు, జరగనివ్వబోమని చెప్పు
"ఆంతా
సర్దుకుంటుంది, చట్టం
చూస్కుంటుంది"
అని బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి చెప్పకు
అలా జరగదు
ఆమె మనసు ఇప్పుడు పగిలిన అద్దం
ఆ పదునైన గాజు ముక్కలు
రాజ్యం గొంతులో...
దిగబడి పగ తీర్చుకోవాలనుకుంది
ఆమె హృదయం ఒక
ప్రార్ధనా గీతం
తరతరాలుగా పాడుతున్న అదే ప్రార్ధనా గీతం
కానీ ఏ పరిశుద్ధుడూ కరుణించట్లేదు
ఏం చేస్తుంది?
కన్నీరు రక్తమై ఆమె నాడిని నింపేస్తుంది
నా దళిత తల్లులు తరతరాలుగా ఇదే చేస్తున్నారు
ఊపిరే ఆర్తనాదంగా...
బ్రతుకే నిరసనగా...
ఆంతా సర్దుకుంటుంది, న్యాయ దేవత కరుణిస్తుంది
అని బిడ్డను కోల్పోయిన ఆ తండ్రికి చెప్పకు
అలా జరగదు
ఆ తండ్రి కన్నీళ్లను ఆహారంగా మింగి
మనసు రాయి చేసుకుని
సమాజంలో నిర్జీవంగా తిరుగుతున్నాడు
కన్నీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు
కన్నీళ్ళు కడుపుకు
సయించక ఓ రోజు కన్నుమూస్తాడు
నా దళిత తండ్రులు తరతరాలుగా ఇదే చేస్తున్నారు
నిరాశే గుండె చప్పుడుగా...
మరణమే జీవితంగా...
నీ రాజ్య ధోరణిని గుర్తుకు తెచ్చుకో
ఆ దళిత బిడ్డ సమాధి పై
గులాబీ తెంచి పెట్టే నివాళుల వెనుకన
వారి వ్యంగ్యాన్ని గమనించు
"సంయమనం
పాటిద్దాం
చట్టాన్ని గౌరవించి శాంతియుతంగా నిరసిద్దాం"
అనే వారి వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకో
ఒరేయ్ పిచ్చోడా!
నీ గుండెపై కత్తి పోటు పడితే
నీ ఒంటిపై లాఠీ దెబ్బలు పడితే
ఇంకా శాంతికి సమయం ఏంటి?
కత్తితో, లాఠీతో...
రాజ్యం నీ పై ప్రకటించిన యుద్ధం కనబట్లేదా?
ఇది శాంతికి సమయం కాదు
ఇది యుద్ధానికి సమయం
ప్రదర్శించిన ఓర్పు చాలు...
చూపిన క్షమ చాలు...
నీపైన పెట్టిన కత్తిని గుర్తుపెట్టుకో
నీపై గురిపెట్టిన తూటాను గుర్తుపెట్టుకో
నీ ఒంటి పైన లాఠీ దెబ్బలను గుర్తుపెట్టుకో
నీలోని ఆ రాక్షసుణ్ణి ఇక బయటకు రానీ...
నీ విషపు కోరలు చూపెట్టు...
నీ బలమైన పంజా ఎత్తి కొట్టు...
నీ సంకెళ్లను తెగ్గొట్టుకో...
ఇది... యుద్ధం...
-
పిటి పార్కర్
15 సెప్టెంబర్, 2021
0 Comments