#సిరివెన్నెల #Music_heals #విరించి_విపంచి
ఈ పాటను నా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విన్నాను. ఇలాంటి తెలుగు పాట వినడం నాకప్పుడే మొదటి సారీ. ఏదైనా అర్థం తెలుసుకోవాలనే కుతూహలం నన్ను తొలిచేసింది. కానీ ఎంత విన్న బుర్రకు తట్టలేదు. కానీ రాగం విపరీతంగా నచ్చేసింది. అప్పట్లో తెలుగు పుస్తకాలు చదవడం కూడా లేదు. అందుకే సామాన్య పదాలు కూడా అర్థం కాలేదు. అప్పటికీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ కూడా లేదు. కానీ విన్నప్పుడు గుర్తున్న ఓ రెండు లైన్లు కూని రాగాలు తీసేవాడిని. వర్డ్సవర్త్ గారు "సాలిటరీ రీపర్" అనే పద్యంలో చెప్పినట్టుగా... విన్న ఆ సంగీత గమకములు ఎక్కడికీ వెళ్లినా ప్రతిధ్వనించసాగాయి.
కొన్నాళ్ళకు దాని ఊసే మరిచాను. సంవత్సరం తరువాత మరలా ఇదే పాటను స్వరాభిషేకం కార్యక్రమంలో విన్నా. వెంటనే గుర్తొచ్చింది... అప్పటికీ స్మార్ట్ ఫోన్ లేదు గాని ఫీచర్ ఫోన్ లో సౌండ్ రికార్డర్ తో రికార్డ్ చేసా. మాకు ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు గాని ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది. రికార్డ్ అయిన తరువాత సిస్టంలో పాట కోసం వెతికా. పాట లిరిక్స్ దొరికింది గాని...అబ్బో ఇదేం తెలుగు? అని అనిపించింది. ఒక్క వాక్యం అర్ధం కాలేదు. నిఘంటువు సాయంతో కొన్ని పదాల అర్ధాలతో రెండు వాక్యాలు అర్ధమయ్యాయి.
ఎంత వెతికినా మనకి అర్ధం దొరకలేదు. కాలేజీలో ఆడుగుదామంటే మనమేమో "సంస్కృత" సబ్జెక్టును రెండో భాషగా ఎంపిక చేసాము. నిస్సహాయంగా ఉండిపోయా. కానీ ఆ స్వరాభిషేకం క్లిప్పింగ్ ను మరలా మరలా వింటూండేవాడిని. వినగా, వినగా పాట నోటికొచ్చింది గాని అర్ధం మాత్రం తెలియ రాలేదు.
ఈ సమయంలోనే తెలుగు భాష పై అలక మొదలయ్యింది. మొదలెట్టా... మిగతా సినిమాల్లోని పాత పాటలను విని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించా. అన్నీ కాస్తో, కూస్తో అర్ధమవుతుంది గాని ఈ పాట ముడి మాత్రం విప్పడం రాలేదు. అప్పటి నుండి తెలుగు సాహిత్యం విస్తృతంగా చడవనారంభించాను. ఇంతలో డిగ్రీ చేరా. ఈ సారి తప్పు చేయదలచుకోలా...తెలుగును రెండో భాషగా తీసుకున్నా. మా గార్డాన్ లైబ్రరీ, మా జోసెఫ్ మాస్టర్ గారు తెలుగు పై ఇంకా మక్కువను పెంచారు.
ఇక ఈ పాట అర్ధం పెట్టె పనిలో పడ్డా. అప్పటికీ కొన్ని తెలుగు పుస్తకాలు చదివిన తరువాత ఈ పాట కొంత అర్ధమయ్యింది. ఈ సారి బ్రౌన్ గారి నిఘంటువు సాయంతో తెలుసుకున్నా. విచిత్రమేమిటంటే మా డిగ్రీలోని తెలుగు పద్యాల ప్రతి పదార్ధాలలో కొన్ని అర్ధాలు దొరికాయి. చరణం మొత్తం అర్ధమయ్యింది గాని పల్లవి మాత్రం పైపైనే...
చివరికి ఎవరో మహానుభావుడు ఈ పాట అర్ధాన్ని నెట్టింట్లో ఇంగ్లీష్ లో పెట్టాడు. ఆయన కనిపిస్తే దండాలు పెట్టాలనిపించింది. సిరివెన్నెల గారు మొట్ట మొదటి పాటను ఇంత బాగా ఎలా రాయగలిగారో ఆశ్చర్యమేసింది.
అప్పటికీ "కుల నిర్మూలన" చదవడం మొదలు పెట్టలేదు. చదివిన తరువాత కొంచెం ఈ పల్లవి నచ్చినట్టు అనిపించలేదు. కానీ తరువాత మరలా అర్ధం పై పడ్డా... మొదటి చరణంలో బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తే నేను బ్రహ్మనై మరలా ఈ విశ్వ పుట్టుక తిరిగిరాస్తున్నా అన్న వాక్యంతో మొత్తం పల్లవి సీరియస్ గా తీసుకొనవసరం లేదు అనిపించింది.
పల్లవంతా బ్రహ్మ ఎలా సృష్టించాడు అని చెప్తే... చరణంలో తాను ఎలా పునర్నిర్మించుకున్నాడో చెప్తాడు. అక్కడ బ్రహ్మ వాక్కుతో సృష్టి అవిర్భవిస్తే... కవి రాసుకున్న చరిత్రలో పక్షి కిలకిల రావాలు సృష్టికి ఊపిరినిచ్చాయి. సృష్టినంతా సంగీతంతో అణువనువునూ పోలుస్తూ సాగే ఈ గీతం... చివరికి కవి ధ్యేయం తెలపటంతో ముగుస్తుంది. నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిచ్ఛ్వాసం గానం వాక్యాలు విన్నప్పుడు గగుర్పాటు వస్తుంది.
విరించినై, విపంచినై... ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు ఉండాలనే కవి కోరికలు నిజంగానే నిజమయ్యాయి. ఈ పాట విన్నప్పుడు సంగీతమే సృష్టిని చేసింది అనే అంగీకారానికి వచ్చేస్తాము.
నా కోరికా అదే!
గానం కాదు గాని కవనం!!!
- #పిటి_పార్కర్
0 comments:
Post a Comment