"పిడికెడు ఆత్మ గౌరవం కోసం"(జై భీమ్ సినిమా గురించి...)
"Somebody have stolen my pencil lids sir" అని కొత్తగా కొనుక్కున్న లిడ్ బాక్స్ పోయిందని నా ముందు నుంచొని చేస్తున్న కంప్లైంట్ విని విసుగొస్తుంది. పీరియడ్ అయిపోతున్నప్పుడు డైరీలు సంతకాలు చేసేప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ ఎం చేస్తాం, ఆ పని చూడకపోతే రేపు లిడ్ బాక్స్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా వస్తారు పేరెంట్స్ అని ఎవరన్నా పొరపాటున తీసారా అని ఆడిగేసరికి బెల్ కొట్టేశారు.
ఇంతలో తరువాతి పీరియడ్ టీచర్ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. నా మాటలు విని ఏమైంది సార్ అని ఆడిగేసరికి విషయం చెప్పా. "సర్, ఫలానా పేట వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. వాళ్ళే చేస్తారు" అనేసరికి ఖంగుతిన్నా. ఇంతటితో ఆగకుండా వారి బ్యాగులు వెతకడం మొదలెట్టేశారు కానీ ఏమీ దొరకలేదు. అది దళిత పేట అని తరువాత తెలిసింది. నిజానికి ఆ పేట నుండి వచ్చేవారే బాగా చదివి ర్యాంకులు సాధిస్తారు. మరి ఆ పేట స్వభావం టాపర్స్ అని కాకుండా దొంగలు అనే భావన ఒక privilege నుండి వస్తుందని పొలిటికల్ సైన్స్ చదివిన నా మట్టిబుర్రకు వెంటనే తట్టలేదు.
ఈ దొంగ ముద్ర చెరిపేసుకోడానికి రాజన్న ఎత్తిన పిడికిలి, ఆత్మగౌరవ నినాదమే ఈ జై భీం సినిమా
"అరేయ్ ఈ దెబ్బలు కొన్ని రోజులకు మనిపోతాయిరా
కానీ దొంగ అనే ముద్ర మాత్రం పోదురా...
కాస్త ఓపిక పట్టారా..."
...అని చిత్రహింసలకు గురిచేసినా జైలు బయట ఆత్మ గౌరవంతో కారం ముద్దలు తింటున్న రాజన్న మాటలు వింటుంటే గగుర్పాటు వచ్చింది. ఆ ఆత్మ గౌరవ పిడికిలి చనిపోయే వరకు దించలేదు. ఆ మాటలు వింటుంటే పద్మారావు గారి ఒక్కఅడుగు ముందుకు అన్న కవిత గుర్తుకొచ్చింది
"నా కన్నీళ్ళకు
ఉగ్గిన్నెలు బట్టి
నా గుండె లోతును కొలవ చూసింది.
వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని
నేనంటే రోజూ శిలువ వేస్తారు.
అందుకేనేను ఒక్కడుగు ముందుకేస్తాను
వీళ్లు నా వెనుక నడుస్తారు."
రాజన్న చనిపోయాడు కాదు చంపేశారు. కానీ ఆ వేసిన అడుగు చెరిగిపోలేదు. దానికి మరొక అడుగు వేసింది సినతల్లి.
" ఈ తిండికి డబ్బులెక్కడివి అని రేపు నా పిల్లలు అడిగితే 'ఇది మీ నాన్నను కొట్టి సంపినోళ్లిచ్చిన డబ్బులు. దీనితోనే మనం బతుకున్నాం' అని చెప్పమంటారా? మమ్మల్ని ఎవరు చంపినా ఎవరూ అడగని దిక్కులేని అనాధలమే. కానీ హాంతకులిచ్చిన డబ్బుతో కడుపు నింపుకోలేం" అని పిడికెడు ఆత్మ గౌరవ నినాదంతో అంబేడ్కరుని ఆనవాళ్ళతో కోర్టు మెట్లెక్కి జై భీం అని గట్టిగా నినదించింది.
మీకు ఆ నినాదం వినబడిందా?
అయితే ఒక్కసారి గట్టిగా అనండి
#జై_భీం
- పిటి పార్కర్
5 నవంబర్, 2021
0 Comments