Tuesday, 21 April 2020

'సిరా'కు సిరాకు

'సిరా'కు సిరాకు

పుస్తకాలు చదువేప్పుడు పెన్నుతో నాకు నచ్చిన వాక్యాలను అండర్లైన్, హైలైట్ చేసుకోవడం, ముఖ్యమైన వాక్యాలు పుస్తకంలో రాసుకోవడం అలవాటు నాకు. అండర్లైన్, హైలైట్ చేసి పుస్తకాన్ని అందవిహీనం చేస్తే గాని చదివినట్లుండదు నాకు.

ఈ లాక్ డౌన్ తో పరిస్థితి ముదిరి పాకాన పట్టింది. రాయాల్సిన మోతాదుకంటే ఎక్కువే రాస్తున్న, గీస్తున్నా, చదువుతున్నా! నిన్న పుస్తకం చదివేప్పుడు అండర్లైన్ చేస్తే పెన్ను రాయడం లేదు. తీరా అసలు విషయం తెలిసి గుండెలో రాయి పడ్డట్లయ్యింది. ఇంకా రెండు పెన్లు మినహాయించి ఏమీ లేవు. ఇప్పుడవి అయిపోతే ఏమిటి పరిస్థితి అని ఆలోచనలో పడ్డా! అవి అయిపోతే బయటకెళ్లి కొనుక్కోవడానికి మా రెడ్జోన్లో దుకాణాలు ఉండవు. అప్పుడే రాశా ఈ 'సిరా'కు సిరాకు అని కవిత. ఈ పెన్నులు అయిపోయేలోపు లాక్ డౌన్ ఎత్తేస్తే బావుండు!!!




'సిరా'కు సిరాకు

నా హృదయ తరంగాలు
అయోమయంలో విహరిస్తుంటే
తెల్లని కాగితపు పుటులను మీటి
నా ప్రేమను చిగురింపజేశావు

ఓ సిరా! నా భావాల సితారా
నన్ను విని అలకబూనుడెందుకు?
కలంతో విలువల వర్ధంతి చేస్తున్నామనా?
విరక్తి చెంది వీడ్కోలు చెబుతున్నావు!

ఆడుగంటుతున్న అభ్యుదయ భావాలు
అంధకారంలో సంచరిస్తుంటే
తెల్లని కాగితాపు యుద్ధ భూమిలో
నీ రక్తాన్ని చిందించి అమరమయ్యావు

ఓ సిరా! నా భావాల సితారా
నన్ను చూసి దాగుకొంటున్నవెందుకు?
కలాన్ని కులంతో కంపు కొట్టిస్తున్నామనా?
కరుణ లేకుండా కాఠిన్యం చూపుతున్నావు!

సృజనాత్మక శ్వాసలు, సంగీత ప్రాసలు
మనసులో సంఘర్షించుకుంటుంటే
షేక్స్పియర్ కలంలో ప్రాణమై
తెల్ల కాగితం పై శ్వాసలొదిలి అజారామరమయ్యావు!

ఓ సిరా! నా భావాల సితారా
నన్ను ఎరిగి పారిపోవుడెందుకు?
కలంతో కల్ల చాటిస్తున్నామనా?
కలత చెంది కదిలెళ్లిపోతున్నావు!

నీలిమేఘాలు, పారిజాతాలు, నింగిచుక్కలు
గుండెసడిని తాకి అలరిస్తుంటే
వర్డ్సవర్త్ ప్రియమైన కవితకై
తెల్లకాగితంపై నీ హొయలొలికించి ముగ్ధులను చేసావు

ఓ సిరా! నా భావాల సితారా
నన్ను వీక్షించి విస్మరించుడెందుకు?
కలంతో ద్వేష కాలుష్యం జరుగుతున్నందుకా?
జాలి చూపకుండా జరిగిపోతున్నావు!

సిరా కొనుటకు దుకాణం లేదు
మనసారా రాయుటకు మనసు నిమ్మలం లేదు
నా ఆలోచనలు ఇంకుడుగుంతలో నీరు వలే పదిలమా?
ఆలోచనలు ఇంకక ముందే ఆవిరయ్యిపోతే?
కరోనా కాలాన్నే కాదు...
నా కలాన్ని కూడా కాటేసింది!

- పిటి పార్కర్ 



Share:

0 comments:

Post a Comment