#Christhurajapuram_Diaries - క్రీస్తురాజపురము గంజాయి మత్తులోనే కాదు; లింగ,ఉపకుల అహంకార మత్తు కంపులో తేలుతుంది

#Christhurajapuram_Diaries

క్రీస్తురాజపురము గంజాయి మత్తులోనే కాదు; లింగ,ఉపకుల అహంకార మత్తు కంపులో తేలుతుంది

చిన్నప్పుడు ఎప్పుడు చావులు చూడలేదు. ఎవరో ఒక బీరకాయ పీసు చుట్టం, అది కూడా ఒక ముసలాయన చనిపోతే వెళ్లానేమో... అప్పుడు కూడా తెగ భయపడేవాణ్ణి. 10 క్లాసులో మా మామయ్య చనిపోతే ఆ పార్ర్ధీవదేహం చూసి ఆస్తమా వచ్చింది. అంత అరుదుగా ఉండేవి మరణాలు.

ఇప్పుడు సహజ మరణాలు కాదు. హత్యలు చూస్తున్నా. ఇంతకుముందు ఎవరినో హత్య చేశారు, ఆత్మహత్య చేసుకున్నారు అని టీవీల్లో వస్తే చూసి మనకేం కాదులే అనుకున్నా... ఇప్పుడు అక్కడా, ఇక్కడా నాకు తెలిసిన వాళ్ళు, నాతో చదివిన వాళ్ళు, నాకు తారస పడినవాళ్ళను హత్య చేశారు, ఆత్మహత్య  చేసుకున్నారు అని విరివిగా వింటున్నా.

రమారమీ నాకు తెలిసిన నా జూనియర్లు, నాతో చదివిన వారు, ఎంతో కొంత తెలిసిన వారి గురించి మొన్న కూర్చుని రాస్తే 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ప్రేమ అనే పేరు మీద జరిగినవే ఎక్కువ అనేది కఠోర వాస్తవం. హత్యలు కూడా నాకు తెలిసిన వారిని, నేను తిరిగిన అతికొద్ది ప్రదేశాల్లో జరిగాయి, జరుగుతున్నాయి అంటే ఎంత భయంకరమైన స్థితిలోకి మనం దిగజారిపోతున్నామో మనం ప్రశ్నించుకోవాలి.

దివ్య తేజస్విని హత్య ఉదంతం విన్న తరువాత మొదట ఖంగుతిన్నాను. ఎక్కడో చూసినట్టుందే అని అనుకున్నా. తరువాత మీడియాలో నాతో చదివిన వారు మీడియాలో మాట్లాడుతుంటే అనుకున్నదే నిజం అయ్యింది. మొన్నటి వరకు రోడ్డు పై తిరిగితే హత్యలు, రేపులు అని విన్నాం. ఇప్పుడు అవి బెడ్ రూంలో పడుకున్న వారిని కూడా వదలట్లేదు. మొదట చట్టాలను, పోలీసులను ప్రశ్నించే ముందు మనం ఎం భావజాలం నూరిపోస్తున్నారో ప్రశ్నించుకోవాలి.

క్రీస్తురాజపురములో అనే చక్కని పల్లె గంజాయి మత్తులోనే కాదు, ఉపకులం,లింగ అహంకారం అనే మత్తు కంపు కొడుతుంది. క్రీస్తురాజపురములో నాలుగేళ్లు నివాసమున్న వాడిగా నేను చెప్తున్న. అసాంఘికం పెరిగిపోతోందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న  కొంతమంది జనాలు అప్పట్లో నన్ను, నా గొంతుకను బట్టి నా లింగాన్ని హేళన చేసి, గేలి చేసినవారే.

రోడ్డు మీద మగాళ్ళు ఓ చోట చేరి ఆడవారిని కళ్ళతో, మాటలతో అత్యాచారం చేసేస్తారు. అంత ఘోరంగా ఉంటాయి ఆ వర్ణనలు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో  సెక్స్ గురించి మాట్లాడడం ఒక పెద్ద డిగ్రీ అని నాకు మొదట అక్కడే తెలిసింది. అలా మాట్లాడితేనే రసికుడు, మగాడు. బూతులు మాట్లాడకపోతే అసలు వీడు మగాడే కాదు అని మార్కులేసేస్తారు కూడానూ... జీవితంలో లకారాలు అతి సామాన్యంగా మాట్లాడేప్పుడు వాడుతారని మొదట అక్కడే తెలిసింది. ఇవన్నీ పట్టించుకోకపోనట్టు ఉంటే "పాయింట్ 5" అని...ఇలా రకరకాల పేర్లు ఎదుర్కోవాలి. ఇన్ని ఉన్నా ఆ పేటకు వెళ్ళినప్పుడు నాకు అమ్మమ్మ ఇంటికి వెళ్లినట్టు అనిపిస్తుంది. అదే రీతిలో మంచితనం, ఆప్యాయత ఉంటుంది కాబట్టి.

మనం ఎం విత్తుతామో అదే కోస్తాం అన్నట్టు. లింగ, ఉపకుల అహంకారం, అసాంఘికం చూస్తున్నా మిన్నకున్నారు, ఇప్పుడు పెరికివేయడం కష్టమైనంత మహావృక్షంగా ఎదిగింది. అసాంఘికంగా తయారవ్వడానికి ఎక్కడో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు లేవు. మనం మగతనం పేరు మీద చేసే చిన్న హేళనలతోనే బీజం పడుతుంది.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. సూర్యరశ్మికి మించిన మందు లేదు. నది రోడ్డులో బీజాలు పడుతున్న ఈ అసాంఘిక శక్తులను నరికివేయడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే నరికేయాలి అనుకోవాలి! అంతే...

LOVE YOU CHRISTHURAJAPURAM... (IF YOU CAN DO THAT)

(భావాలు కేవలం వ్యక్తిగతం)

-        పిటి పార్కర్

Post a Comment

0 Comments