ఆత్మాభిమానం నేర్పిన పాఠం - కర్ణన్
"పల్లె పై పడ్డారు పోలీసు కొడుకులు
వాళ్ళ లీడరేమో సీఐ సాయిబాబా
వాని బానిస ఎస్సై మాదారు
వాని కుక్కలన్నీ అరవై ఉన్నాయి
కారాలు నూరారా, బూతులు తిట్టారా
లాఠీలు పట్టారా, వాళ్ళని తరిమే కొట్టారా"
"చిందింది రక్తం చుండూరులోనా" పాటలో ఈ వాక్యాలు అందరికీ గుర్తే ఉండుంటాయి. అప్పటి చుండూరు, కారంచేడు ఘటనలు ఇప్పటికీ గుర్తే ఉండుంటాయి. పెంటయ్య కొడుకు పేరు మోసెస్ అయ్యేసరికి తట్టుకోలేకపోయారు కులపోళ్లు. పెంట ఎత్తాల్సిస పెంటయ్య కొడుకు vsr కాలేజీకి పోతుంటే పళ్ళు నూరారు. పెంట ఎత్తాల్సిస పిచ్చయ్య కొడుకు మల్లెపువ్వులా ఇస్త్రీ చేసుకొని టీచర్ ట్రైనింగ్ కి వెళ్తుంటే పిచ్చెక్కిపోయారు. గొంతులు కోశారు.
దళిత కథలన్నీ ఇవే. ఎక్కడ వారి ఆత్మాభిమానం పెరుగుతుందో అని ఆ కులపోళ్ళకి భయం. ఆ ఆత్మాభిమానం కోసం పోరాటమే ఈ కర్ణన్ సినిమా. "పొడియానకుళం" అనే ఓ పల్లెటూరు. నాగరికతకు అతి దూరంగా వెలివేయబడ్డ ఊరు. ఎంత వెలివేయబడ్డ ఊరంటే బస్సులు ఆ దారిలో వెళ్తున్నా అక్కడ ఆపని వెలివేత. పసిప్రాణం మరణపుటంచుల్లో ఉన్నా బస్సు ఆపని కఠిన వెలివేత. ఆ వెలివేతను సహిస్తూ వచ్చారు పెద్దలు.
ఈ మధ్యే ఉప్పెన సినిమా గురించి రాస్తూ అణచివేయబడ్డ కులాల కథలన్నీ ఏడ్పులే. అందులో కథానాయకులు చేతగాని దద్దమ్మలు అని చెప్పా. కర్ణన్ ఇందుకు భిన్నమైనది. పల్లె పెద్దల బానిస ఆలోచనలు ఎదిరించి పల్లెను ఏకం చేశాడు. అతనికి కండలు లేవు, మగతనం చూపించే కోర మీసాలూ లేవు. ఉన్నదల్లా ఆత్మాభిమానం.
గాడిద తక్కువది, గుర్రం గొప్పది అని అంటుంటాం. దాన్ని వ్యతిరేకించి మట్టాలాదివారం నాడు యేసు గాడిద మీదే ఊరేగారు. ఈ symbolismను దర్శకులు కళ్ళకు కట్టారు. గాడిద పారిపోతుందని రెండు కాళ్ళ బంధం వేశాడు కాపరి. గాడిదకు ఆత్మాభిమానం ఉంది, దాని శక్తి దానికి తెలుసు, బంధం వేసినా పరిగెత్తింది. కర్ణన్ కు అర్ధమయ్యింది. ఆ సంకెళ్లు ఎవరో వెయ్యలేదు ఇప్పుడు. మనకు మనమే వేసుకుంటున్నాం. ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నాం అని. తిరగబడ్డాడు. ఇక మీ తలవంచి, చెప్పులు తీసే కాలం పోయింది తాత. "ఇది మా తరం. అడ్డు రాకండి" అని గట్టిగా అరిచాడు.
బానిస పాటలు నేర్చుకొని బాలుడు రాయితో బస్సెందుకు ఆగదో చూపించాడు. పల్లె కళ్ళు తెరిచింది. ఈ పోరాటం ఒక్కడిదే కాదు. ఇది మన పోరాటం అన్నారు. మధ్యలో ప్రభుత్వ తాయిలాగా వచ్చిన ఉద్యోగం దెబ్బతీసింది. "నువ్వు నన్ను మట్టిలో మట్టుబెడితే దుమ్మునై వస్తా" అని ఆఫ్రికన్ రచయిత్రి మాయా ఏంజెలో అన్నట్టు కర్ణన్ కత్తి పట్టాడు. ఆత్మాభిమానంతో ఎదిరించి కాపాడుకున్నాడు.
ఖైదు అయ్యి తిరిగొచ్చిన కర్ణన్ కు చివరిలో బామ్మ ఒక మాటంటుంది. " కర్ణన్, ఇనెళ్లు ఏడ్చింది చాలురా. ఇక పై మన వాళ్ళు ఎడవకూడదు రా! ఆడి పాడి సంతోషంగా ఉండాలి." ఏడుపుగొట్టు కథలకు స్వస్తి పలుకుదాం, పోరాడదాం అని దర్శకుడు చాచి కొట్టాడు. ఎవరిని అని అడగకండి. సినిమా చూస్తే అర్ధంవ్వుతుంది.
Amazon Primeలో చూసేయండి
#Karnan #KarnanMovie #KarnanMovieReview #Dhanush #RajishaVijayan #MariaSelvaRaj #Vcreations #AmazonPrime #Dalit
Follow me on Instagram...
0 Comments