రాయని కధ
ఇరుకు గదిలోన, ఎర్ర దీపం కింద
డొక్కు ఫ్యాన్ రెక్కల చప్పుళ్ళ మధ్యన
రెక్క విరిగిన కుర్చీలో కూర్చుని
విదిలిస్తే గాని రాయని పెన్నుతో
న్యూస్ పేపరుతో అట్టేసిన పుస్తకం తీసాను
మనసు గందరగోళపడింది
పదాలు మైల అని దూరమెళ్లిపోయాయి
వ్యధలు యాదికొచ్చాయి
కన్నీరు కౌగిలించుకుని కునుకుతీయమంది
నా వ్యధలు చూడలేక నేల కుంగింది
విడిపోయిన నాపరాళ్ళను సరి చేసి
ఒడ్డు గిల్లుదామని బొంత వేశా
ఇంటికెళ్తున్నా పందికొక్కు పలకరించింది
వేలాడుతున్న అదే డొక్కు ఫ్యాన్ వెక్కిరించింది
నొచ్చుకున్న నన్ను నెలవంక పిలిచింది
వెలుగుతున్న చీకటిలో విరిగిపోయిన తడిక చాటున
కలలందుకోలేని కబుర్లు చెప్పుకున్నాము
సుప్పనాతి సూర్యుడు సయించలేక
నెలవంకను నెట్టేశాడు
నాగలి నాతో రమ్మని తీసుకుపోయింది
నాగలిని భుజాన వేసుకొని
నాగమ్మను వెంటబెట్టుకుని
నిద్రపోయిన నారుమడిని
నీళ్లు జల్లి నిద్ర లేపా
నీరసించిన దేహం చెట్టు చాటున
కునుకు తీసింది
పర్వతాల మధ్యన దాగున్న చంద్రుడు
కబుర్లాడడానికి వేచి ఉన్నాడు
సుప్పనాతి సూర్యడు
చంద్రుడికి చేరువవుతానని
దారి వెంటే వచ్చాడు
నీరసించింది దేహం
అయినా కాగితం పై కలం కదిలించా
రానే వచ్చాడు చీకటి నాయకుడు
ఇంటి ముంగిట్లో ఎదురుచూస్తున్నాడు
రాకపోయేసరికి గబ్బిలాలను
పంపి గోల పెట్టాడు
చిక్కని చీకటిలో
చమత్కారాలు చర్చించాను చంద్రుడితో
బువ్వలేని కడుపు ఎముకలను అంటింది
కాలానికి కన్ను కుట్టింది
నా కన్ను మూశాడు
చావు చూసిన చంద్రుడు
నే రాసుకున్న చరిత్రను దొంగిలించాడు
చావు వార్తనందుకున్న మబ్బులు
జోరుగా కురిసి కాగితాలను తడిపేశాడు
నా కలం రాసిన కావ్యాల సిరాని
కనుమరుగు చేశాడు
సూర్యుడు వచ్చి చావు దండోరా వేశాడు
ఆనందంగా...
ఇక నా చరిత్ర రాసేదెవరు?
- పిటి పార్కర్
0 Comments