తెలుగు రాష్ట్రాలలో నా తోటి దళిత యువతను చూస్తుంటే బాధేస్తుంది. ఓ వైపు దీనికి ఆధిపత్య కులాలను నిందిస్తున్నా... అసలు ఈ వివక్షను ఎదురుకొనడానికి, ప్రతిఘటించదానికి నా దళిత అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్లు ఎం చేస్తున్నారు అని ఓ నిమిషం ఆలోచించా... నాకు సమాధానం దొరకడానికి పెద్ద సమయం పట్టలేదు. ఏమన్నా చేస్తుంటే చెప్పడానికి ఒక అరనిమిషమైనా దొరుకుతుందేమో అని దీర్ఘంగా ఆలోచించినా అరనిమిషం కాదు కదా... అర సెకను సమాధానం కూడా దొరకాలేదంటే మీకు అర్ధమవ్వుతుంది. మన దళిత యువత చేస్తుంది సూన్యమని!
దళితుల పై వరుస సంఘటనలు దళిత సమాజాన్ని వెక్కిరిస్తుంటే, దళిత ఆత్మగౌరవాన్ని నాలుగు రోడ్ల కూడలిలో నగ్నంగా నిలబడిపోతే దళిత యువకులు చూసి చూడనట్టు పోతున్నారే గానీ అసలు జరుగుతున్న వాటిపై కించిత్ బాధ కూడా లేదు.
ఇందులో రెండు రకాల గ్రూపులున్నారు
మొదటివారు, అసలు రాజకీయాలు అంటే మాకు తెలియదు. అది ఒక మురికి కూపం. నేను వాటి గురించి మాట్లాడదలచుకోలేదు అనే భావనలో ఉంటారు. ఇలాంటి వారికి అమాయకత్వం అని అనుకుంటే పొరపాటే. వారికి ఎం మాట్లాడితే ఎం అవుతోందో అనే భయమే ఎక్కువ. దీనిలో ఇంకొంతమంది అసలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఎమోస్తుంది అని ఎదురు ప్రశ్నలు వేసేవారు లేకపోలేదు. వీరింకా రాజకీయం అంటే గుడ్డలపై నినాదాలు రంగులతో రాసి, తలకి ఎర్ర గుడ్డ కట్టి నడిరోడ్డు పై కూర్చుని అరవడమే నిరసన అనే భావనలో ఇంకా బతుకుతున్నారు. ఇవన్నీ తప్పించుకోవడానికి కారణాలే తప్ప మరేమీ కాదు.
ఇక రెండవ వారి గురించేనా బాధంతా... ఎవరో ఒక ఆధిపత్య కులాలకు సంబంధించిన ఒక వ్యక్తి లేక సినిమా నటుడు ఊగిపోతూ కొన్ని రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేస్తే అదే గొప్ప రాజకీయం అనే భ్రమలో ఉంటున్నారు. వీరు ఆ మందమతి అయిన ఆ ఆధిపత్య కులాల వ్యక్తిని మోసుకుంటూ వస్తారు. వారు చేసే పనులలో ఏమాత్రం ప్రజాప్రయోజనం లేకపోగా వారి మోచేతి నీళ్లు తాగడానికి ఉవ్విళ్లూరుతూ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని యూట్యూబ్ కామెంటుల్లో, ఫేస్బుక్కు వాల్ మీద బూతు దాడులకు దిగుతూ అదేదో గొప్ప అభ్యుదయం అని అనుకుంటారు. మనువాదం ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. చివరికి ఎం జరుగుతుందో తెలియకుండా బతుకుతారు.
ఇలాంటి వ్యక్తులతో బాగా చదువుకున్న వారే ఎక్కువ... అంటే సమాజాన్ని చదవలేదు. రోడ్ల పై బాగా తిరిగి, ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేయడమే గొప్ప డిగ్రీ అని ఫీలవుతుంటారు. వీరు లేచిన దగ్గరనుండి చేసేదేమిటంటే ఆ పనికిమాలిన వాడు నవ్వినా విడ్డూరమే,... అన్న నవ్వాడు అని ఒక పోస్టు, వాడి పుట్టినరోజు అయితే పెద్ద ప్రహసనమే... వారం రోజుల ముందు నుండి అడ్వాన్స్ బర్త్డే ట్రెండ్ అని వాట్సాప్ స్టేట్స్లను, ట్విటర్లను నింపుతుంటాడు. అది వేరే నాయకుడిలేదా నటుడి రికార్డులను పోలుస్తూ ట్వీట్లు, పోస్టులు, అబ్బో...అదో పెద్ద వెర్రనుకోండి. మళ్ళా తరువాత బర్త్డే ట్రెండు... ఇంకెవరన్నా వ్యక్తి పుట్టిన రోజైతే వీరు ఆరాధించే ఆ వ్యక్తితో ఈ వ్యక్తి ఉన్న ఫోటో పెట్టి...ఆడింకో ట్రెండు! ఈ మధ్య నా ఫ్రెండ్స్ లిస్టులో ఇలాంటి మూర్ఖులు చాలానే ఉన్నారు అని తెలిసింది. వారందరూ 70 శాతం దళితులే. వాడు... తుమ్మితే ఒక పోస్టు, దగ్గితే ఒక పోస్టు, నవ్వితే పోస్టు, పక్షులకు గింజలేస్తే పోస్టు, ఆవుకు అరటిపండు పెడితే పోస్టు....ఇంకా చెప్పుకుంటూ పోతే రోజు సరిపోదనుకోండి.
ఎప్పుడో ఒక ఆధిపత్య కులాలకు సంబంధించిన ఒక స్త్రీ లైంగికంగా హింసకు గురైతే ఇక ఆ చెంగువీర, వీరుడు ఆవేశంగా ప్రసంగాలిస్తే... జాతరలో వేశాలేసుకున్న అమ్మోరులా శివాలెత్తుతారు ఈ మూఢ భక్తులు. అప్పుడు ripలు , జస్టిస్ ఫర్ అంటూ మొదలెడతారు. ఒక రెండు రోజులు ఈ నిరసనలతో వాట్సాఅప్ హోరెత్తిపోతుంది. ఆ తర్వాత అదేంటో కూడా గుర్తుండదు. దేశంలో రోజుకు పదుల సంఖ్యలో దళిత మహిళాలు మౌన రోదన పెడుతుంటే ఈ ఆధిపత్య కులాల నాయకులు మాకు సంబంధం లేని విషయం అని పక్కన మౌనంగా కూర్చుంటుంటే... ఆ ఆధిపత్య జీవికి దళిత యువత నీరాజనాలు పడుతూ, ఆ ఆధిపత్య పల్లకీలను మోస్తూనే ఉన్నారు.
ఈ మధ్యే ఇలాంటి వ్యక్తిని తనకు హక్కులు ఇచ్చిన అంబేడ్కర్ గురించి ఏమి తెలుసని అడగ్గా... రాజ్యాంగ నిర్మాత అనే ఒక్క పదం తప్ప ఏమీ తెలియదు. కానీ ఆయన ఆరాధించే ఆ కులపు వ్యక్తి గురించి గంట మాట్లాడమన్నా మాట్లాడతాడు. ఇదీ దళిత యువత పరిస్థితి.
నిన్న రాంగోపాల్ వర్మ ఆఫీసు పై దాడి చేసిన కొంతమంది యువత జనసేన కార్యకర్తలు అని తెలిసి సరేలే అనుకున్నా. తరువాత ఈ బ్యాచ్ మేము దళితులం, బహుజనులం.... అట్రాసిటీ కేసు పెడతాం అని టీవీలో మాట్లాడుతుంటే ఒక్కసారి నా గొంతు పూడుకుపోయింది. Sc, st అట్రాసిటీ ఆక్ట్ దుర్వినియోగం అవుతుంది అని వాదిస్తున్న ఆధిపత్య కులాలకు ఎలా దుర్వినియోగం చేయవచ్చో చక్కగా చేసి చూపించి ఎదో ఉద్ధరించాం అని జబ్బలు చరుచుకుంటూ శివాలెత్తిపోతూ బహుజనపదాన్నీ నిన్న నడి రోడ్డులో నిలబెట్టిన విధానానికి నాకు నోటి మాట రాలేదు.
ఎవరో ఆధిపత్య కులానికి చెందిన ఒక సినిమా వ్యక్తిపై (ఆయన కాదని చెప్తున్నా) ఇంకొక ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి తీస్తుంటే ఎదో ఉద్ధరకుల్లా ఆఫీసుపై దాడి చేసి హీరోలుగా ఫీలవుతున్న వారిని చూస్తే బాధేస్తుంది. అదే కాదు ఆ వీడియోను నిన్నటి నుండి తోటి దళిత యువత పోస్టులు పెట్టి విజయ గర్వం పొందుతుంటే నాకేదో వెక్కిరింత లా అనిపించింది.
మొన్న రాజ్గృహ పై దాడి జరిగినపుడు ఈ బహుజన యువత ఏమైపోయారో నాకర్ధం కావట్లేదు. నిన్నటి దళిత యువకుడి హత్య, శిరోముండనం...వీరు ఉద్ధరకులు అనుకుంటున్న నాయకులు వారి పల్లకీలు మోసే ఈ యువకులు ఏమైపోయారు?
RGV ఆడవాళ్ళను అవమానిస్తున్నాడు అని గగ్గోలు పెడుతున్న ఈ యువత దాడులే పరిష్కారం అయితే చేయాల్సిన ఆఫీసులు చాలానే ఉన్నాయి. మొదట ఆడవారిపై నీచమైన జోకులేసే ఆ జబర్దస్త్, అదిరింది షోల ఆఫసులపై...ఆడవాళ్లను అంగట్లో సెక్స్ బొమ్మగా చూపిస్తుంటే సొల్లు కార్చుకోకుండా ఆ సదరు సినిమా ఆఫీసులపై... కాస్టింగ్ కౌచ్ వ్యవహారం బట్టబయలైనప్పుడు ఈ ప్యాన్స్ సమస్యను వదిలేసి ఎవరో ఎదో అన్నారని బూతు దాడులకు దిగి...పక్క దారి పట్టించిన విషయం అందరికీ తెలిసిందే... మరి ఆ ఆరోపణలు ఎదురుకొంటున్న వారిపై దాడులు ఉండవా?... ఇలాచెప్పుకుంటూ పోతే దాడి చేయకూడని ఏవీ మిగలవేమో....
ఇన్ని సమస్యలు దళిత, స్త్రీజాతిని పట్టి పీడిస్తుంటే ఇంకా ఆధిపత్య పల్లకీలు మోసే ఈ మనువాద యువతను చూస్తే సిగ్గేస్తుంది!
ఇలా కొనసాగితే దళితుల హక్కులు...ఇక మరిచిపోవాల్సిందే!
0 comments:
Post a Comment