Thursday, 14 May 2020

ఆధునిక అంటరానితనం - కులం తోకల కత్తిరింపు ఎప్పుడు?


ఆధునిక అంటరానితనం - కులం తోకల కత్తిరింపు ఎప్పుడు?
(కుల నిర్మూలన ప్రచురితమైన రోజు సందర్భంగా)

మొదటి కుల నిర్మూలన ప్రతి 




దేశములోని కులాన్ని నిర్మూలించాలి లేదా కులమే దేశాన్ని నిర్మూలిస్తుంది అని అంబేద్కర్ గారు ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు జాతక్ పాత్ తొడక్ మండలి సభ్యులకు హితవు పలికారు. మరి ఈరోజు ఆ ప్రశ్న మనం వేసుకుంటే భారత దేశంలోకులం అని రుగ్మతను నిర్మూలించడానికి ఎటువంటి అడుగులు పడలేదు అనేది స్పష్టం అవుతుంది. అంటరానితనం, అస్పృశ్యత వంటి కుల పునాదులు ఆధునిక మార్గాలను వెతుక్కుంటూ వస్తుంది.

కుల వ్యవస్థకు మూల కారణం నిస్సందేహంగా హిందూ మతం అని చెప్పుకుంటున్న మతం. "హిందూ మతం ఒకవిధి నిషేధాల శిక్షా స్మృతి. ఇదే మతమనుకోవడం మూర్ఖత్వం." అని ఆంబేడ్కర్ గారు తన పుస్తకంలో చెప్తారు. అలాగని మనిషికి మతం అక్కర్లేదు అని చెప్పరు. "నిజమైన మతం సమాజానికి పునాది. నిజమైన ప్రజాప్రభుత్వానికి అది ప్రాతిపదిక" అన్న బర్క్ గారి వాదనను సమర్ధిస్తారు. కానీ నిషేధాల శిక్షా స్మృతి అయిన హిందూ మతం తనను తాను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని కొన్ని సూత్రాలను కూడా చెప్తారు. దీని కోసం హిందూ మతానికి ఒక ప్రామాణిక గ్రంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటారు లేకపోతే ఈ మనుస్మృతి వంటి మూర్ఖ సిద్దాంతాలు మత సిద్ధాంతాలు కాకూడదు అని ఏనాడో హెచ్చరించారు. కానీ హిందూ మతం వీటిని పట్టించుకోలేదు. ఇప్పుడు నిష్ఠా గరిష్ఠా హిందువులు అని చెప్పుకునే వారు గతంలోదంతా గొప్పదని, పవిత్రమనే భావాన్ని చెప్తారు. కొరొనా కాలంలో భౌతిక దూరాన్ని కూడా అంటరానితనానికి ముడి పెట్టి మన కుల వ్యవస్థ గొప్పదని చెప్పిన మూర్ఖులు లేకపోలేదు. హిందూ మతం మిషనరీ మతం కాదు అని గగ్గోలు పెట్టె ఈ సంఘ పరివార్ వారు అసలు ఒకప్పుడు హిందూ మతం మిషనరీ మతం కుల వ్యవస్థ వల్లే ఈ పరిస్థితిలో ఉందని అంబేద్కర్ గారు చెప్పింది తెలుసుకోవాలి.

ఇప్పుడు కులవ్యవస్థ పరిస్థితి మరింత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు హిందూ మతంలోనే ఉందని అనుకుంటే ఇప్పుడు అన్ని మతాల్లోకి ఇది తోడ్కొని వెళ్లారు. చర్చీల్లో కమ్మ కులాల ఆధిపత్యంలో కొన్ని చర్చిలు, మాదిగల ఆధిపత్యంలో కొన్ని చర్చిలు, మాలల ఆధిపత్యంలో కొన్ని చర్చిలు ఉన్నాయంటే పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అసలిప్పుడు క్రైస్తవ్యంలో పెద్ద పాస్టర్లంతా ఆధిపత్య కులాల వారని తెలుస్తూనే ఉంది. అంటే ఈ కుల వ్యవస్థ లోని ఆధిపత్య ధోరణి మరలా కొత్త పుంతలు తొక్కుతోంది.

ఆధునిక అంటారానితనం రాబోవు తరాలకు చాప కింద నీరు లాగా జరుగుతుంది. సాంఘీక మాధ్యమాల్లో ఈ కులాహంకార పోస్టులు చూస్తే మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది. మచ్చుకు ఒక ఉదాహరణ ఇస్తాను. టిక్టాక్ అనే సాంఘీక మాధ్యమంలో ఈ మధ్యే ఆధిపత్య కులాల పై ఒక డైలాగు చేశారు. ఒకో డైలాగుకు వేలల్లో లైకులు, షేర్లు. విచిత్రమేమిటంటే ఆ ఆడియోకు మళ్ళి వేలల్లో రీమేకులు. మరలా దాని కింద జై కమ్మ, జై కాపు, జై రెడ్డి,... వంటి కామెంట్లు దర్శనమివ్వడం పెద్ద విడ్డూరమేమీ కాదు. ఇంతకంటే ఏమి కావాలి ఆధునిక కులాహంకారానికి ఉదాహరణ.

దానిదేముంది మా కులాన్ని గొప్పదనడంలో ఇతర కులాల్ని కించపరిచినట్టు కాదు అని మూర్ఖమైన వాదన తెరపైకి తీసుకొస్తారు. అసలు ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర మరియు పంచమ అనే పదాలు ఇంకా వాడుకలో ఉండడమే కులాహంకారానికి కొనసాగింపు. బ్రాహ్మణ అనే పదమే కింది కులాల పై ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. అలాగే ఇతర కులాలు కూడా. దీనికి మెరుగులు దిద్ది కులాన్ని సూచించే తోకలు పేర్లకు తగిలించడం.

ఈ చౌదరి గార్లు, శర్మ గార్లు, నాయుడు గార్లు, రెడ్డి గార్లు, రాజు గార్లు, గౌడ గార్లు, శెట్టి గార్లు, దేశకముఖ్ గార్లు, దేశపాండే గార్లు,త్రివేది గార్లు, గోస్వామి గార్లు,పాండే గార్లు ఉన్నంత కాలం అసలు కుల నిర్మూలనకు ఎటువంటి అడుగులు పడవు. ఈ పేర్లు ఒక మౌఖిక కుల ధ్రువీకరణ పత్రాలుగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. 2014లో ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఇకనుంచి "దళిత" అను పదాన్ని మీడియాలో, ప్రభుత్వ పత్రాల్లో వాడకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడా ఈ పదం లేదు అని చెప్పింది. దానికి బదులు షెడ్యుల్డ్ కులాలు అనే పదాల్ని వాడమని సూచించింది. విడ్డూరమేంటంటే ఆ శాఖకు లేక బొంబాయి హై కోర్టుకు ఈ కులాన్ని సూచించే పేర్లు సమంజసమనిపించాయి.

పట్టణాల్లో విస్తారంగా కులాల పేరు మీద లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లు, మెస్ లు వంటివి విస్తారంగా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు ఈ కుల సంఘాలు కులాహంకారాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే దీనికి రాజకీయ అండ ఉంది. ఈ కుల సంఘాల్ని ఈ సంస్కరణ వాదులు దేశ దేశాలు మోసుకెళ్తున్నారు. అమెరికాలో కూడా ఈ కుల సంఘాలు ఏర్పడటం ఈ విష వ్యవస్థ విస్తరించడానికి మంచి ఉదాహరణ. విజయవాడ వంటి ఒక మహానగరంలో కులం పేరుతో ఇల్లు ఇస్తారు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే.

పొద్దున లెగిస్తే దిన పత్రికల్లో, టీవీల్లో రెడ్డి మాట్రిమోనీ, కమ్మ మాట్రిమోనీ వంటి పేర్లతో పేజీలను కేటాయించడం కంటే గొప్ప ఉదాహరణ ఎం కావాలి... కుల వ్యవస్థ పెరుగుతుంది అని చెప్పడానికి. అసలు పేరులో కులం తోకలను కత్తిరించడానికి సిద్ధంగా లేని వాళ్ళు కుల వ్యవస్థను నిర్మూలిస్తామనుకోవడం విడ్డూరం.

మ్యాట్రిమొనీ ప్రకటన  

ఆధునిక పుంతలు తొక్కుతున్న మ్యాట్రిమొనీ 

ఇంకా విడ్డూరమేంటంటే మీడియా సంస్థలే కులాన్ని మోయడం. అప్పుడు ఆధిపత్య కులానికి చెందిన "నిర్భయ" దారుణ హత్య జరిగితే దేశమే అట్టుడికి పోయింది. మీడియా అంత కవరేజీ ఇచ్చింది. ఇక్కడ హత్యలకు కూడా కులం పరంగా పేపర్లో ప్రచురణ జరుగుతుంది. నిర్భయ ఘటనకు ముందు తరువాత...దేశంలో రోజుకు ఎందరో దళిత బిడ్డల హత్యలు జరుగుతున్నాయి. కానీ అవేమీ పేపర్లలో దర్శనమివ్వవు. తరువాత కొనేళ్లకు దిశ అనే ఆధిపత్య కులానికి చెందిన మహిళ హత్య జరిగితే పత్రికలు, మీడియా ఏ విధంగా స్పందించిందో చూసాం.అదే రోజు ఇంకా దారుణంగా టేకు లక్ష్మీ అనే గిరిజన మహిళను దారుణంగా హత్య చేస్తే అవేమీ ప్రచురించదు ఈ ఆధిపత్య మీడియా. ఒకవేళ ప్రచురించినా ఒక చిన్న మూల ఉంటుంది. దాని గురించి ఎడిటోరియల్స్ ఉండవు. ప్రత్యేక కధనాలు ఉండవు. సంఘాల నిరసనలు ఉండవు. అది ఈ దేశంలో దళిత ఆడబిడ్డల పరిస్థితి. ఇది ఆధునిక అంటారానితనం అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ.



"సాంఘీక నిరంకుసత్వాన్ని ఎదిరించే సంస్కర్త ప్రభుత్వాన్ని ఎదిరించే రాజకీయవాది కంటే ధైర్యవంతుడయి ఉండాలి" అన్న అంబేడ్కర్ మాటలు మాదినుంచుకోవాలి. ఈ కులం తోకలను కత్తిరించే పనికి సామాజిక కార్యకర్తలు పూనుకోవాలి. దానికి చట్టపరమైన నిబంధనలు తేవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. కుల నిర్మూలనకై అసలైన పోరాటం మొదలు కావాలి. దీనికి విద్య ఒక్కటే పరిష్కారం కాదు. కుల వ్యవస్ధ, దాని రుగ్మతల గురించి ప్రతీ విద్యార్థికి తెలియాలి. ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఇతర సైన్స్ సబ్జెక్ట్ లు చదువుతున్న విద్యార్థులకు కూడా తమ గ్రాడ్యుయేషన్ లలో ఇండియన్ హెరిటేజ్ మరియు కల్చర్ బోధన చేసి రాజ్యాంగ స్ఫూర్తిని, గొప్ప సాంఘీక విలువల్ని నేర్పడం జరగాలి. చరిత్ర దాని గొప్పదనం, నిరంకుశత్వం నేర్పలేని ఎంత సాంకేతిక విద్య అయినా అహేతుకమే!

"హిందూ సమాజం కులరహిత సమాజం అయినప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకొనే శక్తినీ, సామర్థ్యాన్ని సంతరించుకోగలదు. అంతరంగికమైన బలం లేకుండా హిందువులు స్వరాజ్యం వచ్చినా, అది మళ్ళీ దాస్యం వైపు ఒక అడుగు ముందుకు వెయ్యడమే కావచ్చు. బాగా ఆలోచించండి. మీ ప్రయత్నాలు ఫలించుగాక" - అంబేడ్కర్
- పిటి పార్కర్







Share:

0 comments:

Post a Comment