హిందూస్తాన్ జిందాబాద్
పాకిస్తాన్ జిందాబాద్
సామాజిక కార్యకర్త అమూల్యా నినదించిన 'పాకిస్తాన్ జిందాబాద్' భారతీయ రాజకీయవేత్తలలో, కొన్ని వర్గాల ప్రజలలో నిండియున్న దూరహంకారాన్ని ప్రపంచానికి తెలియజేసిందనే చెప్పుకోవచ్చు. మన సహోదర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనుకోవడం పాపమా? నేరమా? అనే ప్రశ్న తలెత్తింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటే హిందూస్తాన్ మురదబాద్ అని అర్థమన్నట్టు భారత ప్రజల మనసుల్లో వేళ్లూనుకుపోయెట్టు చేస్తుంది నేటి భారత రాజకీయ సమాజం.
ఈ పరిస్థితిలో జాతీయత అంటే ఏమిటి? జాతీయవాదం అంటే ఏమిటి? అనే ప్రశ్న భారతీయులైన మనము వేసుకోవాలి. జాతీయవాదం అంటే పక్క జాతీయులను తులనాడటం, ద్వేషాన్ని పెంచుకోవడం అని నేటి సమాజం ఉగ్గుపాల నుండి పోషిస్తుంది అని ఈ సంధర్బంగా నాకు అర్ధమయ్యింది.
"పరస్పరాధీనత నేటి సమాజంలో రోజు క్రమం" అని సామాజిక శాస్త్రవేత్తలు చెప్తూనే వస్తున్నారు. అయినా ప్రజలు నీ రాష్ట్రం, నా స్వరాష్ట్రం అనే అహంకారపూరిత వాతావరణం మానవ మనుగడకు గొడ్డలిపెట్టు అని తెలుసుకోవాలి. భారత ప్రఖ్యాత రాజకీయవేత్త జయప్రకాష్ నారాయణ్ ప్రఖ్యాత సిద్ధాంతమైన "టోటల్ రెవల్యూషన్"లో సాంస్కృతిక విప్లవం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలందరూ ఒకరరినొకరు పరస్పర సాంస్కృతిక సమ్మతి ఉండాల్సిన తరుణంలో మనం ఇప్పుడు ఉన్నాం అని చెప్పారు. ఒక మనిషి జీవనం లేదా తన సంస్కృతి ఎప్పుడూ ఒక చోట స్తంభించలేదు. మారుతున్న కాలానుగుణంగా మనిషి ప్రాధాన్యతలు మారుతుంటాయి. మారిన సంస్కృతితో జీవనం పయనమవ్వకపోతే ప్రజల జీవనం పురావస్తులో వెతుక్కోవలసిందే. నా ధర్మం, నా రాష్ట్రం, నా జన్మభూమి అని పట్టుకు వేలాడితే పురోగమనం అగమ్యగోచరం!
ప్రాచీన గ్రీకు తత్వవేత్త త్యుసీడైడ్స్ "అధికార ప్రేమ ఒక వేశ్య వంటిది. అది మనిషుల్ని, దేశాల్ని వంచించి చెడు మార్గంలోకి తీసుకెళ్తుంది, నాశనం చేస్తుంది" అను వ్యాఖ్యను సర్వేపల్లి రాధాకృష్ణ తన పుస్తకం 'టువార్డ్స్ ఏ న్యూ వరల్డ్' అను పుస్తకంలో ప్రస్తావిస్తూ ఇలాంటి అధికార ప్రేమ మాయలో, అహంకారపూరిత ప్రేమలో బాధితులవ్వకండి. అహంకారపూరితపూరిత జాతీయవాదం అనగా నా దేశంలోనే అన్ని, నా దేశమే అన్ని అనే జాతీయవాదం మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లదు అని చెప్తారు.
ఈ విషయాన్ని వివరిస్తూ సార్వజనికత్వం(కాస్మోపోలీటనిజం), జాతీయవాదం(నేషనలిజం) మరియు అంతర్జాతీయం అను మూడు విషయాల్ని వివరిస్తారు. సార్వజనికత్వం అంటే విభిన్న సంస్కృతులను సమ్మిళితం చేసుకోవడం, జాతీయవాదం అనగా నా దేశమే గొప్ప అనే అహంకారపూరిత ధోరణి మరియు నా దేశ విధానాల్ని అమలు చేయనివారు దిక్కుమాలిన స్థితికి వెళ్లి నశించిపోతారు అనే ధోరణి అని వివరిస్తారు. సార్వజనికత్వం అనేది భారత దేశానికి కొత్త పదమేమీ కాదు ఎందుకంటే ప్రాచీనం నుంచి ఎన్నో సంస్కృతలను అవగతం చేసుకున్న గొప్ప భూమి అని నిస్సంకోచంగా చెప్పవచ్చు కానీ రాధాకృష్ణ గారు జాతీయవాదానికి ఇచ్చిన వివరణ నేటి సందర్భానికి అద్దం పడుతుంది.
జాతీయవాదం అనునది భారత దేశానికి పెద్ద ప్రమాదం గానూ ఉంటూనే ఉంది అని విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ చెప్తారు. జాతీయవాదం అను తత్వాన్ని కవి తీవ్రంగా వ్యతిరేకించారు. 1947లో పాకిస్థాన్ విభజన మరియు 1971లో బాంగ్లాదేశ్ విభజన చూడని కవి చేసిన ఈ వ్యాఖ్యలు, చూస్తే ఎం చెప్పేవారో అని దేశం పునరాలోచించుకోవాలి. విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితులు ఆయన ముందుగానే ఊహించి ఉండొచ్చు. మరి ఇప్పుడూ అలాంటి పరిస్థితులే నేడు మళ్ళీ వస్తుందేమో అని అనిపిస్తుంది. జాతీయవాదం అను ఆయన పుస్తకంలో ఈ విషయంపై కూలంకషంగా చర్చించారు. "రాజకీయం, వాణిజ్యం అను వ్యవస్థలు రాష్ట్రం, జాతీయం అను పేరుతో బలపడి ప్రజల శాంతియుత జీవనాన్ని ఖర్చు చేసే రోజు ఈ మానవ సమాజానికి అమంగళకరమైన రోజు" అని చెప్తారు. విశ్వకవి ఇంకా వివరిస్తూ జాతీయవాదం అను ఈ అంటువ్యాధి దేశమంతా ప్రబలి మానవత్వ హత్యాకాండ చేస్తుంది అని చెప్తారు.
జాతీయవాదాన్ని బానిసత్వముతో టాగోర్ పోలుస్తూ 'మనః స్వాతంత్రం లేని రాజకీయ స్వాతంత్ర్యం అసలు స్వాతంత్రమే కాదు' అని ఖరాఖండీగా చెప్పారు. టాగోర్ పాశ్చాత్య ప్రయాణమైనప్పుడు పాశ్చాత్య సంస్కృతి పై ఒక రకమైన ప్రేమ ఏర్పడిందంటారు. ఇది ఒక దేశాన్ని వ్యక్తిరేకించడం వలన కాదు లేక నేను విశ్వకవినైనందుకు కాదు ప్రపంచాన్ని అనుభవించాను, జీవించాను. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ప్రస్తావిస్తూ "మనిషి నివసించడానికి పుట్టలేదు గాని జీవించడానికి పుట్టాడు" అని అంటారు.
ఈ దృక్పథంతోనే టాగోర్ శాంతినికేతన్ ను స్థాపించారు. మరి విలువలు పెంపొందించుటకు నిర్మించిన ఆశ్రమం సార్వజనిక తేనెగూడు అయ్యింది, మరి ఆ గూడు తేనె అందించిందా లేక తేనెటీగల మోత ఇస్తుందా అనేది పెద్ద చర్చే అవుతుంది అని టాగోర్ జీవితచరిత్ర రాసిన కృష్ణ కృపాలిని అంటారు. 'చరిత్ర ఒక్కటే ఉంటుంది. అదే మానవ చరిత్ర. దేశ చరిత్రలన్ని పెద్ద అధ్యాయాలు తప్పించి మరేమీకాదు' అని విశ్వకవిఅంటారు. అంతర్జాతీయం అను గొప్ప విలువ దేశాల మధ్య మైత్రిని పెంపొందిస్తుంది. ఇప్పటి పరిస్థితికి రాధాకృష్ణ గారు ప్రస్తావించిన అంతర్జాతీయం అను వాదం దేశానికి, దేశంలో నిండియున్న అహంకారానికి ఉపయుక్తం. అంతర్జాతీయం అనగా దేశ అత్యున్నత విలువలను కాపాడుకుంటూ, మన విలువైన విలువలను పంచుతూ, పంచుకుంటూ ఇతర దేశాల్లోని సంపన్న విలువలను గౌరవించి, అంగీకరించి అవగతం చేసుకోవడం. ఇటువంటిదే దేశభక్తి కావాలి. దేశభక్తి నా దేశం సుభిక్షంగా ఉండాలనే అహంకారాన్ని పెంచకూడదు.
"అందరూ బాగుండాలి అందులో నేనుండాలి"
విశ్లేషణ
- పిటి పార్కర్
0 comments:
Post a Comment