Wednesday 17 June 2020

అంతా మీరే చేశారు (తికమక జాతీయవాదం కవిత రూపంలో) || పిటి పార్కర్

అంతా మీరే చేశారు

(తికమక జాతీయవాదం కవిత రూపంలో)

మన జాతీయవాదం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు, ఆగస్ట్ 15, జనవరి 26న ఉప్పొంగుతుంది. సరిహద్దుల్లో వీర జవాన్లు అమరులైనప్పుడు మాత్రమే రగులుతోంది నీ తికమక జాతీయవాదం.  ఎక్కువ జానాభాకు ఎక్కువ మంచి జరగాలనే ఉద్దేశంతో 19వ శతాబ్దంలో మొదలైన ఈ దేశాలు ఇప్పుడు ఆధిపత్య పోరులో మానవ జాతి మనుగడకు ముప్పు తెస్తుంది. మనవాళ్ళు 20 మంది అమరులయ్యారంటే "అయ్యో" అన్న జనాలు... చైనా వారు రమారమీ 35 కంటే ఎక్కువ మంది మరణించారు అనగానే "గట్టిగా సమాధానమిచ్చారు" అని అనటం చూసా. ఎంత ఎక్కువ మందిని చంపితే అంత గొప్పొడైపోతావా??? కొంతమంది మూర్ఖులు అయితే మితిమీరి #WorldWarThree అని ట్రెండింగ్ చేసేశారు కూడా.

 

మనిషితత్వం నుంచి దూరమయ్యే శూరత్వం ఒక శూరత్వమేనా??? వీలైతే శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించండి. పాలుపోని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అశాంతిని రగల్చొద్దు. మనం చేయవలసిన పోరు పేదరికం పైన, ఆర్థిక భారం పైన... దానికి సూత్రం నీకూ తెలుసు, నాకూ తెలుసు కానీ... పాటించము

ఆ విషయం జర చూడరాదే!!!

////////////////////////////////////////////////////////////////////////////////////////////////

అంతా మీరే చేశారు (కవిత)

//////////////////////////////////////////////////////////////////////////////////////////

ప్రధాని ప్రసంగానికి మంత్రముగ్ధుడై

చైనీయుల తీస్తున్న ఆర్థిక దెబ్బకు రగిలి

ఆరోప్రాణమైన షావోమి ఫోను తీసి

పెట్టావా పోస్టు బాయ్ కాట్ చైనీస్ గూడ్స్ అని?

 

రాయలవారి కుమార్తె రాక రాక వస్తుందని

దేశ బిడ్డలను మురికివాళ్ళని గోడ కట్టి ఎడబాటు చేస్తివి

దాయాది దొంగ దెబ్బకు వీరులు అమరులైతే గాని

ఆ ఎడబాటు బాధ ఎట్లుంటదో ఎరుగలేదా పౌరుడా?

 

పండగకు అద్దాల అంగడికి పోయి

ఖరీదైన కాల్విన్ క్లేయిన్ చిరుగు జీన్స్ కొని

చేనేత కార్మికుల వరుస ఆత్మహత్యల పై

నిరసిస్తూ రోడ్డు పై బైఠాయించినావా?

 

పుట్టుకతోనే ఇంగ్లాండు మహరాణియైన

మనవరాలిని ఓక్ రిడ్జ్ కన్వెంటులో దింపి

తిరుగు ప్రయాణంలో తెలుగు మహాసభకెక్కి

తెలుగు సాహిత్యం మరుగౌతుందని శోకించినావా?

 

ఆశయం అద్దాల మేడ ఎత్తుకు

అవకాశం ఆకాశం వరకు

ఆలోచన గాలిలో...

ఆచరణ బురదలో...

- పిటి పార్కర్


Share:

0 comments:

Post a Comment