మామ్మ - "మే!" డే

మామ్మ - "మే!" డే


తెనాలి సెయింట్ జాన్స్ స్కూల్ లో చదువుతున్నప్పుడు... స్కూల్ వదలగానే చిన్న పిల్లలందరూ తెచ్చుకున్న చిల్లరను తీసి ఓ చోట గుమిగూడేవారు. ఓ బామ్మ కొబ్బరిచిప్పలో మరమరాలు, గొట్టాలు నలిపి, ఉప్పు, కారం మరియు కొంచెం నిమ్మరసం పిండి ఒక పొట్లంలో ఇచ్చేది. ఇదంతా నాకు తెలిసి 2 లేదా 3 రూపాయలనుకుంటా... ఒకరోజెందుకో స్కూల్ వదిలేశారు కానీ బామ్మ రాలేదు. ఆమె కోసం చూస్తూ ఉన్నాం. చివరకు తలపై ఒక చిన్న సైజు టేబులు, దానిపై సామాగ్రిని ఒక గుడ్డలో మూటకట్టి వస్తుంది...ఆమె ఈ మసాలాతో పాటు ఏవో తినుబండరాలు కూడా అమ్మేది. ఈ సమాగ్రంతా తలపై మోస్తూ, వంగిపోయి, వణుకుతూ నడుస్తున్నది. కొంత దూరం నడవడానికే ఆమెకు చాలా సేపు పట్టింది. కొన్ని రోజులకో, నెలలకో పానీ పూరీ బండి వాడు పక్కకే విచ్చేసాడు. ఈయన ఎప్పుడైతే వచ్చాడో మామ్మ గారి వ్యాపారం తగ్గిపోయింది. అప్పటినుండి రెండు రోజులు వస్తే రెండు రోజులు రావడం మానేస్తుండేది.

చిన్నప్పుడు మా వీధి చివర రోడ్డు పై ఒక ముదుసలి బామ్మ ఒక చిన్న గోనె సంచి వేసుకొని కూర్చుండేది. మరొక గోనెసంచి పై ఒక కేజీ చిక్కిపోయిన బెండకాయలు, కాసిన్ని వంకాయలు, కొన్ని పండు టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇంకా వీలైతే కొన్ని కాయగూరలు ఉండేవి. కానీ కొత్తిమీర, కరివేపాకు పుష్కలంగా ఉండేవి. వెళ్లాడబడుతున్న చర్మం, భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు...దానిలో నుండి కూడా కనబడక కళ్ళు మిటకరిస్తూ ఉండేది. చేతులు వణుకుతూ ఉన్నా, స్వరం సరిగ్గా రాకున్నా అలా రోడ్డు పై కూర్చొని అమ్మేది. ఆమె అంత చేసినా పెద్దగా కొనేవారే ఉండరు. ఆమె వద్ద మహా అయితే కొత్తిమీర, కరివేపాకు కొంటారేమో! కానీ నేను అక్కడ ఉన్నంతకాలం ఆమెను అక్కడ చూస్తూ ఉండేవాడిని.

మేడే పై వ్యాసం రాయాలని కూర్చున్న వెంటనే...ఎందుకో తెలీదు ఈ రెండు సన్నివేశాలు నా కళ్ళలో మెదులాడాయి. విచిత్రమేమిటంటే ఈ రెండు సన్నివేశాలు జరిగినప్పుడు నా వయస్సు పెద్దదేమీ కాదు...అప్పటికీ మార్క్స్ ఎవరో ఆయన సిద్ధాంతం ఎంటో కూడా తెలీదు కానీ ఎందుకో నా మనసులో నిలిచిపోయారు. మార్క్స్ చదివిన తరువాత చెరగని ముద్రవేసుకున్నారు.

పై రెండు సన్నివేశాల్లో ఉన్నది పేద, బలహీన మహిళలు. వారికి ఒంటిలో సత్తువ లేకపోయినా ఆత్మ విశ్వాసమే ఊపిరిగా తమ చెమటతో బ్రతుకుతున్నారు. వయసు, లింగం అను సమాజ రుగ్మతలను చీల్చి ఉత్త్పత్తి వర్గాలుగా నిలిచారు. ఇక్కడ వాళ్లేమి ఉత్త్పత్తి చేశారు అని మీరనుకోవచ్చు. వారు ఎవరిపై ఆధారపడకుండా వారి జీవనానికి రూకలు ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇంతే కాకుండా నాలాంటి వారిలో ఆత్మ స్థైర్యాన్ని పెంచుతున్నారు.

మనము "ఇంట్రెప్రేనూర్స్" అనే పదాలు  పారిశ్రామికులకే కాదు ఈ బామ్మలకూ వర్తిస్తుంది. ఈ వ్యవస్థాపకులకు ధైర్యం నింపడానికి, దిశా నిర్దేశం చేయడానికి మెంటరింగ్ క్లాసులు అవసరం లేదు, బ్రెయిన్ స్త్రామింగ్ అవసరం లేదు, సరుకు అమ్ముకోవడానికి "ఎకో సిస్టమ్" ఉండాలి అనే జ్ఞానం ఉండదు, పెద్ద కాన్ఫరెన్స్ లు ఉండవు, బోర్డ్ మీటింగులు అసలే ఉండవు. వారి ధైర్యం వారి ఊపిరి, వారికి దిశా నిర్దేశం చేసేది పరిస్థితులు, ఆరోగ్య సమస్యలతో మెంటరింగ్ క్లాసులు, ఆకలితో కాన్ఫరెన్స్ లు, పేదరికంతో బోర్డ్ మీటింగులు... కానీ రెండింటికీ తేడా... మామ్మ గారు తను అప్పటికప్పుడు చేసి అమ్మితే, ఈ పారిశ్రామికుడు దాన్నే రంగు రంగుల ప్లాస్టిక్ సంచిలో సీల్ చేసి ముద్ర వేసి అమ్ముతాడు. మామ్మ రెండు రూపాయలకు అమ్మితే, పారిశ్రామికుడు 5 రూపాయలకు అమ్ముతారు. బామ్మ వ్యాపారం చితికిపోయింది. కూటి కోసం గతి లేక అదే పారిశ్రామికుడి కంపెనీలో జీతానికి కుదిరింది. నెలకు 800 రూపాయల జీతం. బామ్మకు చేతిలో వణుకు పెరిగింది, పారిశ్రామికుడి ఏసీలో చల్లదనం పెరిగింది. బామ్మ ఊపిరాగింది. పారిశ్రామికుడి చేతికి ఉంగరాలు పెరిగాయి. ఇదే వేల ఏళ్లుగా కొనసాగుతున్న దోపిడీ!

ఈ లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తే, ప్రధాన వార్తలన్నీ ఎందుకు వచ్చారో తెలుసుకోలేదు. ఇంతలొకే పోలీసులు లాఠీలు జులిపించారు. ఇలాంటప్పుడు మార్క్ ట్వైన్ గారు అన్న మాటలు గుర్తుకొస్తాయి.  "ధనికులు పేద వారిని దోచుకుంటే దాని వ్యాపారం అంటారు. పేదవారు జరుగుతున్న దోపిడీకి తిరగబడితే దానిని దౌర్జన్యం అంటారు." ఈ మాటలు ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతాది. ఉన్న వాడు ఇంట్లో ఉండి ఎం చేయాలో తెలీక ఆ ఛాలెంజులని, ఈ ఛాలెంజులని రకరకాల వంటలు వండి, తిన్నది అరక్క ఇల్లు ఊడిస్తే ఆహా! ఓహో! అని చప్పట్లు కొడుతున్నారు. జీవితమే ఒక ఛాలెంజ్ అయిపోయింది పేద వారికి... బయటకెళ్తే కొరొనా చంపుతుంది, లోపలుంటే పేదరికం చంపుతుంది. రెండూ వ్యాధులే. ఒకటి ధనికుల డాలర్ల పేరాస వల్ల వస్తే, ఇంకొకటి ధనికుల దోపిడీ వల్ల... చివరికి నలిగేది పేదవాడే.

ఇంగ్లీషులో may అనే పదం ఏమి జరగబోతోందో చెప్పడానికి వాడతారు. అది జరగొచ్చు. జరగకపోవచ్చు. ఈ కార్మికుల దినోత్సవం మేడేగా తెలిసి పెట్టారో... చారిత్రాత్మక పరిస్థితులు అలా అనుకూలించాయో అనే విషయం పక్కన పెడితే... కార్మికుల పరిస్థితి 'మే' (ఎం  జరుగుతుందో చెప్పలేని విధం) గానే ఉంటుంది...సంవత్సరాల తరబడి...

శ్రామికుల దినోత్సవ శుభ'ఆంక్షలు'

- పిటి పార్కర్

Post a Comment

0 Comments