బొజ్జా తారకం గారి కులం – వర్గం పుస్తక సమీక్ష| My review of the book KULAM - VARGAM


బొజ్జా తారకం గారి
కులం – వర్గం
పుస్తక సమీక్ష



“ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అను మార్క్సు మాటలు ఎప్పుడు చెవిన పడినా సామాజిక ఉత్తేజం, విప్లవ భీతి పొంగి పొరలుతుంది. నిజంగా బానిస సంకెళ్ళలో ఇంకా మగ్గుతున్న భరత భూమిని చూస్తే విప్లవానికి ఇవే సంకేతాలు ఏమో? అనే భావన కలుగుతుంది.  మార్క్సిజం తప్ప మరే ఇతర సిద్దాంతాలను అప్పటి వరకు చదవని వారు ప్రపంచంలోని ఏ సమస్యకైనా, గందరగోళానికైనా, దోపిడికైనా మార్క్సిజం తప్ప వేరే పరిష్కార మార్గం లేవని రూడిగా ఒక నమ్మకానికి రావడం పరమ సాధారణం. మొదట్లో అంబేద్కరిజం అనేది ఒకటుంది అనేది తెలియని వారు అంబేద్కరిస్టులు, బహుజన మేధావుల వాదనలు ఆచరణ సాధ్యం కాదు అనే భావన వస్తుంది. ఒకోసారి ఆ వాదం అణగారిన వర్గాల వారి అసహనం తప్ప మరేమీ కాదనే భావం ఉంటుంది. కాని ఇది ఆచరణ సాధ్యం కాని వాదం కాదు అని ఒక చారిత్రాత్మక అవసరమని బొజ్జా తారకం గారి కులం – వర్గం అనే ఈ పుస్తకం స్పష్టంగా వివరిస్తుంది.

                            నిజంగా చెప్పాలంటే మార్క్సుకు, అంబేద్కరుకు, వారి సిద్దాంతాలకు పెద్ద తేడా ఏమీ లేదు ఎందుకనగా ఇద్దరూ సమాజంను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలే గనుక! కాని “కులం అనగానే కొంతమందికి డా|| బి.అర్. అంబేద్కర్ గుర్తుకు వస్తాడు. వర్గం అనగానే  కొంతమందికి కార్ల్ మార్క్స్ గుర్తుకు వస్తాడు.” అని తారకం గారు తన వాదనను పుస్తకంలోని మొదటి వాక్యాలలో ప్రస్తావిస్తారు. కాని భారతదేశంలోని మేధావులు కార్ల్ మార్క్స్ చెప్పిన కులమే ఇక్కడ  వర్గమ నే అభిప్రాయానికి వచ్చేసారు... కమ్మూనిస్ట్ పార్టీలతో సహా. కాని కులం వేరు వర్గం వేరు అని తారకం గారి ఈ పుస్తకం చదివినప్పుడు అర్ధం అవుతుంది. నిజానికి ఈ దేశంలోని వర్గాలు కూడా కులం ఆనే కబంద హస్తాలలో చిక్కుకుందనే చెప్పవచ్చు అని పుస్తకం కవరు పేజీని చూస్తే అర్ధమవుతుంది.
                           తారకం గారు ఎందుకు ఈ వాదన చేసారంటే ప్రపంచ దేశాల పరిస్థితులకు, మన దేశ పరిస్థితులకు చాలా తేడా ఉందని చెప్తారు. “ఎవరు నువ్వు? అనే ప్రశ్న ప్రపంచంలో ఏ మూల సంధించినా అతని పేరో లేక వృత్తినో సమాధానం అవుతుంది కాని భారత సమాజంలో అది కులం తెలుసుకోవడానికి ఉత్పన్నమవుతుంది.

“ఒక పేద బ్రాహ్మణుడు, ఒక ధనిక సూద్రుని మధ్య సామాజిక గౌరవం బ్రాహ్మణునికి దొరుకుతుందంటే నిర్ణాయక శక్తి ధనం కాదు కులమే అని రుజువు అవుతుంది”

మరి మార్క్సిజం గొప్పదా లేక అంబేద్కరిజం గొప్పదా?
ఫలానా వాదం గొప్పది లేదా తక్కువది అనేది తారకం గారు ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగని మార్క్సిజం భారత సమాజానికి అవసరం లేదని చెప్పలేదు. మన సమాజానికి వర్గ నిర్మూలన, కుల నిర్మూలనా రెండూ అవసరమే అని చెప్తారు. మరి కుల నిర్మూలన ముందా లేక వర్గ నిర్మూలన ముందా అనే ప్రశ్నతో పుస్తకంలోని సింహభాగాన్ని కేటాయించారు, సుదీర్ఘ విశ్లేషణ చేసారు. చివరకు కుల నిర్మూలన అనేది వర్గ నిర్మూలనకు ఆవశ్యకము అని ఆయన విశ్లేషించారు. అది కాదనలేని వాస్తవం కూడా అని ఆయన పుస్తకం లోని “ప్రపంచంలో రాజ్యం డబ్బున్న వారిదైతే ఇక్కడ రాజ్యం కులం ఉన్న వారిది అయ్యింది” అనే ఒక వాక్యం ద్వారా అర్ధమవుతుంది. ప్రపంచంలో వర్గం అభివృద్దికి అడ్డుగా నిలిస్తే మన దేశంలో కులం, వర్గం రెండూ అడ్డుగా నిలిచాయి అని తారకం గారు ఆయన నమ్మిన సిద్ధంతాన్ని విపులీకరించి చారిత్రాత్మక దృక్పధంతో వివరిస్తారు.

కమ్యూనిస్ట్ పార్టీలు కుల నిర్మూలనకు అడుగులు వేస్తున్నయా?
పై ప్రశ్నకు తారకం గారు కమ్యూనిస్ట్ పార్టీలు కుల నిర్మూలనా పోరాటంలో విఫలం అయ్యారని అభిప్రాయపడ్డారు. వారు ఇప్పటికీ స్వతంత్రుడు – బానిస, ప్రభువు – బానిస, యజమాని – అర్ధ బానిస లేదా యజమాని – కార్మికుడు అనే భావనలోనే ఉండిపోయారని ఈ సమాజంలోని నలుగు పడగల హైందవ నాగరాజు గురించి పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో నిస్సతువ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు.
“కులం అనేది ఆర్ధిక పునాది పై ప్రభావం చూపటమే కాకుండా ఉపరితలంలోని మిగిలిన అంశాలయినా రాజకీయాలను, మతాన్ని, న్యాయవ్యవస్థను, సాహిత్యాన్ని, సంస్కృతిని ఎంతగా ప్రభావితం చేస్తుందో వీరు గమనించలేదు”

పరిష్కారం
ప్రపంచ సమస్యలకు ఆర్ధికమైన పరిస్థితులు కారణమని కార్ల్ మార్క్స్ అభిప్రాయపడ్డారు. ఆయన జీవించిన ఐరోపా సమాజంలోని సమస్య అదే గనుక. గనుక ఆర్ధిక పునాదులు పెకలించివేస్తే వాటి ఉపరితలంలోని బానిసత్వం, దోపిడీ లాంటివి నిర్మూలన అవుతాయని తెలియజేసారు... అది ఐరోపా సమాజంలో కొంతమేరకు రుజువు అయిన వాస్తవం కూడా... కాని ఒకోసారి ఉపరితలమే పునాదిని ప్రభావితం చేస్తుందని... అది విప్లవానికి గొడ్డలిపెట్టు అని తారకం గారు తన పుస్తకంలో ప్రకటించారు.

మార్క్సిజం – రూపాంతరం
“ఒకే మౌలిక సిద్ధాంతం ఆయా దేశాలలో అన్వయించటం జరిగేసరికి, ఆయా దేశాలలో కాలాలు, పరిస్థితులను బట్టి కొత్త రూపం తీసుకుంటూ వచ్చింది. ఆ విదంగా కొత్త రూపం తీసుకోకపోతే మార్క్స్ వాదం పిడివాదం అవుతుంది, జడ సిద్దాంతం అవుతుంది. దీనిని గమనించపోతే మార్క్స్ వాదం కూడా కర్మ సిద్ధాంతం అయిపోతుంది” అని తారకం గారు తన చెప్పదలచిన విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఉపరితల అంశాలు ఆర్ధిక పునాదిపై ప్రభావం చూపుతూ ఒకోసారి అవే ప్రధాన నిర్ణాయక అంశాలు అవుతాయని కూలంకష౦గా ఈ పుస్తకంలో చర్చించి పాఠకులను భావ సందిగ్ధంలో నుండి బయట వేసారనే చెప్పొచ్చు.
“కుల వ్యవస్థ ఏర్పడటానికి బ్రిటీషు పరిపాలన కారణం కాదు, అదే విధంగా అది మనుగ సాధించడానికి కూడా అది కారణం కాదు”

విషయ పరిశీలనా
తారకం గారు తన పుస్తకంలో అనేక పుస్తకాల పుటులలో దాగియున్న సంక్లిష్ట అంశాలు సులభంగా పాఠకులకు అందించారు. ఎన్నో పుస్తకాలలో ఉన్న చరిత్ర గతి, భారత దేశం గురించి మార్క్స్ అభిప్రాయం, సాంస్కృతిక విప్లవం, కులాల మూలం, కుల నిర్మూలనలో రాజకీయ పార్టీల పాత్ర వంటి అనేక అంశాలు వివరిస్తూ సాగిన ఈ పుస్తకం బహుజన వాదం గురించి తెలియని వారికి ఒక కనువిప్పు అనే చెప్పవచ్చును. చెప్పవచ్చును ఏమిటీ అదే నిజం కూడా...
                     పుస్తకం అంతా విషయ పరిజ్ఞానంతో నిండి ఉంది అనేది నిత్య సత్యం కాని ఎందుకో కొన్ని అంశాలు చెప్పినవే మరలా వివిధ అంశాలలో తిరగతోడినట్టు నాకు అనిపించింది కాని అంశాలలోని ప్రజ్ఞాపాటవాల సంద్రంతో కొట్టుకుపోతారు పాఠకులు.     

-   పిటి పార్కర్ . జె
RELATED POSTS:

కొంతమంది కుర్రవాళ్లు

Post a Comment

2 Comments

  1. Good and enlightening review.

    ReplyDelete
  2. Good review. Thanks for sharing. I read this book recently and I completely agree with your last sentence.

    ReplyDelete