గడ్డం - ఓ సొల్లు పురాణం
ప్రపంచం ముఖ్యంగా భారతదేశం లింగ గతానుగతికత్వము (Gender stereotype) కు ఒక మంచి ఖర్ఖానాగా ఫారిఢవిల్లుతూనే ఉంది. మగాడు ఏడ్వకూడదు, బయట తిరగాలి, బైకులు ఇష్టపడాలి, గంభీరంగా మాట్లాడాలి, ఆధిపత్యం ప్రదర్శించాలి, బూతులు మాట్లాడాలి, అంగాంగ వర్ణనలు చేయాలి, సిగెరెట్టు పొగలు వదలాలి, మద్యం తాగాలి, తాగి వాగాలి... ఇలా ఉంటూనే ఉన్నాయి. ఈ మూసనే తప్పు అని చెప్పలేక తిప్పలు పడుతుంటే ఈ ఖర్ఖానాలో కొత్త సరుకు మరింత ధృఢంగా తయారయ్యి ఎగుమతి అయ్యి, మెదళ్ళలో దిగుమతి అయిపోతుంది.
జనాలలో సామాజిక దృక్పథం తగ్గిపోయి, సాంఘిక శాస్త్రంని 100 మార్కులకి 10వ తరగతిలో అమ్మేసి ఇంజనీరింగ్ యంత్రాల్లో పడి, ఇటు చదువు వంటబట్టక, అటు ఉద్యోగాలు రాక లింగ గతానుగతికత్వము అను ఖార్ఖానాల్లో జేరి యువకుల మెదళ్ళలో ఈ విషాన్ని నింపుతున్నారు. (ఇంజినీర్లను ఉదహరించాను ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వారే). ఇక వీటికి ఊతమిస్తూ గంతకు తగ్గ బొంత అన్నట్టు తెలుగు సినిమాలు బయలుదేరుతాయి. ఒకనికి మాసిపోయిన గడ్డం పెట్టి, వాడు పొగ వదులుతూ మద్యం సేవిస్తుంటే వెనక ఒక dts సౌండ్. దానికి తగ్ లైఫ్ అని ఒక పనికిమాలిన ట్యాగ్.
ఈ ఖార్ఖానా ముఖ్యంగా సోషల్ మీడియాలో స్లీపర్ సెల్స్ లా పని చేస్తున్నాయి. మీమ్ పేజీల్లో అవి కోకొల్లలు. ఉబుసుపోని కబుర్లు, సొల్లు పురాణాన్ని వీడియోలుగా చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి.
వీటికి ప్రత్యక్ష ప్రభావాలు నేను టీచరుగా చేసిన సంవత్సరం చూసాను. 13 దాటని పిల్లలు చొక్కాలకు గుండీలు విప్పదీసి, షర్ట్ ఎదో కండలు కనిపించాలి అన్నట్టు మడతపెట్టి, నూనూగు మీసాలు, రాబోతున్న గడ్డాన్ని సవరించుకుంటూ నడుస్తుంటారు. ఇక 10వ తరగతి పిల్లల సంగతి చెప్పనవసరం లేదు... ఇప్పటికే విషం బాగా ఎక్కేసింది
పొద్దున యూట్యూబ్ లో చూసాను. Sravan Kotha ఛానెల్ ఆట. ఈ సొల్లు పురాణం ప్రవచించాడు. గడ్డం గ్లోరియస్, గ్లామరస్, అని చెప్తూ పోతూ అక్కడితో ఆగకుండా పురుషత్వం అనే స్థాయికి వచ్చేసాడు. మను కుల వ్యవస్థను నిచ్చెన మెట్లతో కట్టినట్టు ఈ పురుషాహంకార ధోరణులను పటిష్టంగా మెట్టు మెట్టుగా కట్టుకుంటూ ఆకాశానికి తీసుకుపోతున్నారు. ఈ పురుషాహంకార తోకలు కత్తిరించక పోతే రాబోవు యువతకు లైంగిక హింసకు మంచి ఆయుధాలు సమకూర్చిన వారిమౌతాము.
గడ్డం పెంచుకుంటే పెంచుకో అంతేగాని దానికి పురుషత్వం, పురుష లక్షణాలు అని సొల్లు పురాణాన్ని జోడించి gender stereotypingను పటిష్టం చేస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది.
గడ్డం పెంచడానికి సూరత్వం జోడించడం, మీసానికి వీరత్వం జోడించడం, ఛాతి రోమాలకు రసికత్వం జోడించడం.... ఇలాంటివన్నీ పురుషాహంకార ధోరణులే. అవి గోరిగి బ్యాంకులో తాకట్టు పెడితే ఎవడూ అప్పు ఇవ్వడు.
#Beard #noshavenovember #NoShave2020
0 comments:
Post a Comment